తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా తమిళనాడు అంతటా ఈరోజు కోలాహలం నెలకొంది. ఓ పక్క అన్నాడీయంకే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారి జయలలిత ఇమేజ్ ను సొంతం చేసుకోడానికి తీవ్రంగా పోటీపడుతుంటే.. మరోపక్క జయలలిత బంధువులు కూడా జయ ఇమేజ్ ను తమవైపుకు తిప్పుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే జయలలిత జయంతిని పురస్కరించుకొని అటు పళనిస్వామి వర్గం ఇటు పన్నీర్ వర్గం రెండుగా విడిపోయి పోటాపోటీగా అమ్మపేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జయలలిత జయంతి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో పలు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి నిర్వహించారు.
అయితే ఓ పక్క పార్టీలో ఇంతటి అంతర్గత కుమ్ములాటలతో పోటీలు పడి మరీ అమ్మ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని ఆయా వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే... జయలలిత మేనకోడలు దీప ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ అన్న పేరుతో తమిళనాడులో ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ సందర్భంగా ఎంజీఆర్, జయలలిత ఫోటోలున్న పార్టీ లోగోను ఆవిష్కరించిన దీప ఇక నుండి తమ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని వెల్లడించింది. జయలలిత జయంతి సందర్భంగా ఆమె మేనకోడలు దీప మెరీనా బీచ్ లోని జయ సమాధివద్ద నివాళులర్పించింది. ఈ సందర్భంగా దీప చాలా ఉద్వేగంతో మాట్లాడుతూ.. తాను జయలలిత ఆస్తులను సొంతం చేసుకోవడానికి రాజకీయాల్లోకి రావడం లేదని, అమ్మ వాడిన పెన్ను కూడా తనకు వద్దని వివరించింది.
నిజానికి తనకు అమ్మ ఆస్తులు ముఖ్యం కాదని, అమ్మ దీవెనలు ఉంటే చాలని దీప స్పష్టం చేసింది. ఇంకా దీప మాట్లాడుతూ... జయలలిత నిజమైన వారసురాలిని తానేనని, అమ్మ వలె తాను కూడా పేదల కోసం పోరాడుతానని వివరించింది. ఇంకా దీప మాట్లాడుతూ.. తనకు పలువురు రాజకీయ ప్రముఖుల మద్దతు ఉందని, తాను ఆర్కేనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని కూడా తెలిపింది దీప. చూద్దాం ముందు ముందు తమిళనాడులో రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయో.