ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుడు నాని. డైరెక్టర్ అవుదామని సినిమా రంగానికి వచ్చిన ఆయన అనుకోకుండా హీరో అయ్యాడు. అయినా దానిలోనే ఎదగాలని, కృషి చేసి స్టార్ అనిపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాగే తనకున్న దర్శకత్వ శాఖలోని అనుభవంతో, కథలను జడ్జి చేయడం నేర్చుకున్నాడు. ఆ క్రమంలో అనేక ఆటుపోట్లకు గురయ్యాడు. అయిన మొక్కవోని దీక్షతో ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. వైవిధ్యభరితమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ నేచురల్‌స్టార్‌గా ఎదిగాడు. 'అష్టాచెమ్మా' నుండి 'నేను లోకల్' వరకు ఆయన కెరీర్‌ను చూస్తే ఔరా అనిపించకమానదు. ఈ మధ్యకాలంలో చిరు, రవితేజల తర్వాత స్వయంకృషితో, ప్రతిభతో ఎదిగిన హీరోగా నాని పేరును చెప్పుకోవచ్చు. ఇక ఆయన కెరీర్‌ను 'భలే భలే మగాడివోయ్' ముందు తర్వాత అని విభజించుకోవాలి. అంతకు ముందు ఆయనకు 'అష్టాచెమ్మా, ఈగ' వంటి హిట్స్ ఉన్నా, 'ఎవడే సుబ్రహ్మణ్యం' తో విజయపరంపర స్టార్ట్ చేసినా కూడా ఆయన కెరీర్ 'భలేభలే మగాడివోయ్' తర్వాత మారిపోయింది. మారుతి దర్శకత్వంలో అల్లుఅరవింద్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. వరుసగా ఆరు హిట్లతో రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడని, మిగతాహీరోలు ఒక్క హిట్ కోసమే నానా తంటాలు పడుతుంటే నాని మాత్రం దూసుకుపోతున్నాడని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు.
ఇక వరుస చిత్రాలతో దండయాత్ర చేస్తోన్న ఈ యువ హీరో జోరుకు మిగతా హీరోలు సైడ్ ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నెక్ట్స్ ఏంటి? అంటూ వరుసగా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'నేనులోకల్'తో బ్లాక్‌బస్టర్ అందించాడు. ఇక 'నేను..లోకల్' చిత్రం విడుదలకు ముందు ఆయన దానయ్య నిర్మాణంలో శివ శర్వాన అనే నూతన దర్శకునితో ఓ చిత్రం షూటింగ్‌లో భాగంగా అమెరికాకు వెళ్లాడు. అక్కడ మార్చి10 వరకు ఉంటాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను, టైటిల్‌ను తాజాగా విడుదల చేశారు. 'నిన్నుకోరి...' అనే రొమాంటిక్ టైటిల్‌తో, పొయిటిక్‌గా ఉన్న పేరును పెట్టుకున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో నాని కూడా తనదైన రొమాంటిక్ లుక్‌తో కనిపిస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఘర్షణ' చిత్రం పాటలోని 'నిన్ను కోరే' అనే పదంతో ఈ చిత్రం టైటిల్‌ను నిర్ణయించడం విశేషం. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన తనకు 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రం చేసిన హనురాఘవపూడితో మరో చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం హను.. నితిన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక నాని కూడా 'నిన్ను కోరి' తో బిజీ బిజీ. సో.. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత నాని-హనురాఘవపూడిల చిత్రం పట్టాలెక్కనుంది. ఇక ఆ తర్వాత ఆయన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి అల్‌రెడీ ఎప్పుడో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. తనకు 'అష్టాచెమ్మా' తర్వాత మరో హిట్‌ను 'జెంటిల్‌మేన్'తో అందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తరహాలోనే 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి హిట్ ఇచ్చిన హనురాఘవపూడితో రెండో చిత్రం చేయనున్నాడు. ఇక శ్రీని 'జ్యో అచ్యుతానంద'లో కాసేపు కనిపించిన నాని.. శ్రీనితో రెండో చిత్రం చేస్తున్నాడు. కాబట్టి ఇంద్రగంటి సెంటిమెంటే హను, శ్రీని విషయంలో ఆయనకు కలిసి వస్తాయని భావించవచ్చు. కాగా ఈ రోజు(ఫిబ్రవరి 24) నాని జన్మదినం సందర్భంగా ఆయనకు సినీజోష్ బర్త్‌డే విషెస్.. తెలియజేస్తోంది.