అధికార తెలుగుదేశం చేస్తున్న తప్పులను ఎండగట్టడంలో ప్రతిపక్ష వైయస్సార్‌సీపీ విఫలమవుతోంది. చంద్రబాబుపై వ్యతిరేకత ఉందని, కాబట్టే వచ్చే ఎన్నికల్లో తాను తప్ప మరో ప్రత్యామ్నాయం ఏపీ ప్రజలకు లేదని, ఎంత అవినీతి ఆరోపణలున్నా కూడా జనం తమకే ఓటు వేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్‌లో జగన్ ఉన్నాడు. అసలు ఆయన పార్టీకి ఒక దశ, దిశ, అజెండా? ఉన్నాయా?లేవా? అనే అనుమానం వస్తోంది. కేవలం రాజశేఖర్‌రెడ్డిపై ఇప్పటికీ ఉన్న సానుభూతే తనకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు, జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ యువత వైజాగ్‌లో చేపట్టిన ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన తర్వాత జగన్ హడావుడిగా స్పందించి, వైజాగ్‌కి వెళ్లి మొక్కుబడిగా నిరసన తెలిపి దానిని హైజాక్ చేశాడు. ఆ తర్వాత కిడ్నీబాధితుల నుంచి పోలవరం, రాజధాని రైతుల వరకు అలాగే స్పందిస్తున్నాడు. ఇక తెలంగాణలో కోదండరాం నిరుద్యోగుల తరపున ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత జగన్ కూడా నిన్న హడావుడిగా నిరుద్యోగభృతి చెల్లించాలని, ఎన్నికల హామీ ప్రకారం ఇంటికో ఉద్యోగం, ఉపాధి చూపించాలని, దానికోసం రాబోయే బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు జరపాలని ఓ బహిరంగ లేఖ రాశాడు.
ఇక మాటల దిట్ట అయిన అంబటి రాంబాబు, రోజాలు మరింత ముందుకెళ్లి వారి నోటికొచ్చినట్లు మాట్లాడారు. కానీ నిజంగా వాస్తవ పరిస్థితులు, రాష్ట్రంలోని ప్రజల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించడంలో జగన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ విషయాన్ని ప్రజలు కూడా బాగానే గమనిస్తున్నారు. కానీ వారికి వచ్చే ఎన్నికల్లో జగన్ తప్ప మరో ఆప్షన్ ఉంటుందా? లేదా? అంత గొప్పగా ప్రభుత్వ వ్యతిరేకతను ఇతరులు ఎవరైనా క్యాష్ చేసుకోగలరా? అప్పటికైనా పవన్ సత్తా చూపించగలడా? అనే అనేక అనుమానాలు మాత్రం సామాన్య ప్రజలను వేధిస్తున్నాయి. ఇక టిడిపి-బిజెపిల పొత్తు వచ్చే ఎన్నికల్లో కూడా ఉంటుందా? వామపక్షాల సంగతి, కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? అందరూ బరిలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి, మరలా బాబుకే మేలు చేస్తారా? అనే అంశాలపై రసవత్తర చర్చ నడుస్తోంది.