తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ నుంచి ప్రతిపక్షాల వరకు పవన్‌ని విమర్శిస్తున్నాయి. ప్రత్యేకహొదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేమని తేల్చిచెప్పినా.. పవన్ పదే పదే అదే అంశాన్ని రెచ్చగొడుతూ, రాజకీయం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు కేంద్రమంత్రులుగానీ, శ్రీవేంకటేశ్వరస్వామి పాదల చెంత తిరుపతిలో ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ, రాజ్యసభలో రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేకహోదా కోసం పోరాడిన వెంకయ్యనాయుడు, ప్రత్యేకహోదా కావాల్సిందేనని పట్టుబట్టిన సీఎం చంద్రబాబులు ఇప్పుడు మాటమారుస్తున్నారు. సూటిగా సమాధానం చెప్పకుండా, ప్రత్యేకహోదా కంటే ప్రత్యేకప్యాకేజీనే మంచిదని చెబుతున్నారే గానీ ఎలా? ఎందుకు? అనే వాటిపై తలోరకంగా మాట్లాడుతున్నారు. ప్రణాళికా సంఘం ఒప్పుకోవడం లేదని, నీతి ఆయోగ్ అనుమతించలేదని, కొంతకాలం తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకహోదా ఉండదని ఇలా తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
కానీ రాజకీయ, ఆర్థికనిపుణులు, మేథావులు మాత్రం ప్రత్యేకహోదా అనే పేరును తీసేసినా కూడా, ఆ హోదా వున్న రాష్ట్రాలకు లభించే ప్రయోజనాలు అలాగే ఉంటాయని విశ్లేషిస్తున్నారు. కేవలం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడానికి ఇవ్వన్నీ కారణం కాదని, రాజకీయ కారణాలు, కుట్రలు, అవకాశవాదమే కారణమని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇప్పటికీ పవన్ ప్రత్యేకహోదాపై నినదిస్తుండటం తప్పుకాదు. ఇక ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్నది కూడా బూటకమని, వాస్తవానికి అన్ని రాష్ట్రాలకు రావాల్సిన నిధులకే ఏపీలో ప్రత్యేక ప్యాకేజీ అని పేరు పెట్టారని కూడా బలంగా వినిపిస్తోంది. పోనీ ప్రత్యేక ప్యాకేజీ విషయానికి వస్తే దీనికి చట్టబద్దత ఇవ్వాలని చంద్రబాబు, ఇస్తామని కేంద్రమంత్రులు చెబుతూ వస్తున్నారు. కానీ నిన్నటి కేంద్ర కేబినెట్‌లో దీనిపై అసలు చర్చే జరగలేదు. టేబుల్ ఐటంగా కూడా ఇది రాలేదు. సమావేశం తర్వాత జైట్లీ మాట్లాడుతూ, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత అంశంపై చర్చించడానికి సమయం చాలలేదని సెలవిచ్చారు. స్వయాన మోదీనే ప్రస్తుతం జరుగుతున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే రాజకీయ ఉద్దేశ్యంతోనే ప్రస్తుతం దానిపై ఎలాంటి చర్చ వద్దని జైట్లీకి స్పష్టం చేశాడని సమాచారం. మరి దీనికి పవన్‌ని విమర్శిస్తున్న వారు ఏం సమాధానం చెబుతారో చూద్దాం...!