ఈ మధ్యకాలంలో సినిమా హీరోల విషయంలో గానీ, రాజకీయనాయకుల విషయాలలో గానీ వారి కంటే వారి పీఏలు, పీఆర్వోలు, మేనేజర్లు.. ఇలా పేర్లు ఏవైనా వీరు ఎక్కువ అతిగా బిహేవ్ చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా కూడా పూజారి అనుగ్రహం లేకపోవడం అనేది చిత్రవిచిత్రంగా మారింది. ప్రముఖులు చాలా బిజీగా, పలు వ్యవహారాలో తలమునకలై ఉంటారు. అందుకే వారు ఇలాంటి అసిస్టెంట్లను పెట్టుకుంటారు. కానీ వీరు మాత్రం తమ హోదాని, పరిమితులను మించి ఓవర్‌యాక్షన్ చేస్తుంటారు. వీరి వల్లనే నాయకులకు, హీరోలకు చెడ్డపేరు వస్తోంది. టాలీవుడ్ కి సంబంధించి ఇప్పటికే ఇటువంటివి పలు ఆరోపణలు వున్నాయి. ఇక తాజాగా హిందూపురం ఎమ్మెల్యేగా, నందమూరి వంశాన్ని విపరీతంగా ఆదరించే హిందుపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పీఏ గా పనిచేస్తున్న శేఖర్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. పీఏ శేఖర్ ఇంకా చాలామందిని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని స్వయంగా టిడిపి నాయకులే ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై బాలయ్యతో సీఎం చంద్రబాబు కూడా చర్చలు జరిపాడు. స్థానిక సంస్థల కోఆర్డినేటర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ కూడా అధిష్టానం వేసింది. అంతర్గత సమాచారం ప్రకారం ఆ నివేదికలో పీఏ శేఖర్ చేస్తున్న తీరు నిజమేనని తేలినట్లు తెలుస్తోంది. కానీ బాలయ్య మాత్రం ఎందువల్లనో కానీ ఆ పిఏపై ఈగ వాలనివ్వడం లేదని సమాచారం. దీనికి కారణాలు ఎవరికి వారు ఊహించుకోవచ్చు. మరోపక్క ఉత్తరాది హీరోయిన్లకు మేనేజర్లగా వ్యవహరిస్తున్న వారు కూడా పలు విధాలుగా ఆయా హీరోయిన్లను ప్రలోభపెట్టి, పక్కదారి పట్టిస్తున్నారని అందరూ గుసగుసలాడుకోవడం బహిరంగ రహస్యం. తాజాగా పవన్ కళ్యాన్ మేనేజర్ శ్రీనివాసరావుపై కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.దీనిపై హీరోలు, హీరోయిన్లు, నాయకులు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.