ఇటీవల వైజాగ్‌లో జరిగిన యువత 'ప్రత్యేకహోదా' ఉద్యమంతో పాటు తెలంగాణలో నిరుద్యోగుల నిరసన సభను సైతం చంద్రబాబు, కేసీఆర్‌లు అడ్డుకున్నారు. దీనిపై స్పందిస్తే మరో 'తుని' ఘటన జరిగితే ఎలా? అంటూ కొందరు వాదిస్తున్నారు. వారు చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది. వాస్తవానికి 'తుని' సంఘటన వెనుక జగన్, భూమన కరుణాకర్‌రెడ్డి వంటి వైసీపీ మాఫియా ఉందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ సభకు అనుమతి తెచ్చుకుంది ముద్రగడ పద్మనాభం. నిజంగా ప్రభుత్వం దగ్గర, సీఎం చంద్రబాబు దగ్గర నిజమైన ఆధారాలుంటే జగన్, భూమనా కరుణాకర్‌రెడ్డిలతో పాటు ముద్రగడ పద్మనాభంను కూడా జైలుకు పంపించవచ్చు. పోలీసులు, ప్రభుత్వాల వద్ద వారు చేసే ఆరోపణకు ఆధారాలుంటే న్యాయస్థానాలు కూడా శిక్షిస్తాయి. సిసి ఫుటేజ్‌లు ఉన్నాయంటున్నారు. మరి ఎందుకు వాటిని ఆధారం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసి, వారు ఎవరు? ఎక్కడి వారు? అనే విషయాలను బహిరంగ పరచడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ప్రజలలో తిరుగుబాటు వస్తుందనా? లేక నియంత పాలన అని విమర్శిస్తారనే భయమా? నిజాలు ఉండి అరెస్ట్ చేస్తే ప్రజలు ఏమీ దానిని నియంత పాలన అనరు.
గతంలో పలు రాష్ట్రాలలో ఇందుకు సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఆరోపణలు చేయడం కాదు.. నిజాలు భయటపెట్టగల దమ్ముందా? ముద్రగడను అరెస్ట్ చేస్తే కాపులు దూరమవుతారని భయమా? మరి ఇది కులరాజకీయం కాదా? ఇటీవల చెన్నైలోని మెరీనాబీచ్ వద్ద జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్న యువత పేరుతో చివరి రోజు పోలీస్‌లు వాహనాలను, ఆటోలను దగ్డం చేసిన విషయం... దీనిపై లారెన్స్ వంటి వారు ఆవేదన వ్యక్తం చేయడం నిజం కాదా? మరి బాబుకు, టిడిపి వారికి జగన్‌ను, ఇతరులను అరెస్ట్ చేసే దమ్ముందా? తుని ఘటనను వంకగా చూపి ప్రతి ఉద్యమానికి ఇలాంటి కుంటిసాకులు చెప్పి, ఆందోళనలను అణిచివేయడం ప్రజాస్వామ్యమేనా? ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచిస్తే ఎవరి మనసుకు వారికి నిజం తెలుస్తుంది.