తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం మాస్టర్ కోదండరామ్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కోదండరామ్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ యువతకి ఉద్యోగాలొస్తాయన్న కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నాడు. ఇచ్చినమాటను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని, ఆ విషయాన్ని నిలదీసేందుకు కోదండరామ్ ఉద్యమిస్తూనే ఉన్నాడు. అయితే, ఇప్పుడు అదే పనిలో పడ్డాడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. అందుకనే తర్వాత తన పోరాటాన్ని నిరుద్యోగ సమస్యలపై చేయనున్నట్లు తెలుస్తుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా యువతకు పలు హామీలు ఇచ్చాడు. బాబు వస్తేనే జాబు వస్తుందన్న విషయాన్ని బాగా ప్రచారం చేయించుకున్నాడు. ప్రతి నెలా నిరుద్యోగులకు రూ. 2 వేల భృతి కూడా కల్పిస్తామని వివరించాడు. అసలు తెదేపాకు యువత అందుకే ఓట్లు వేశారని కూడా చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఏపీలో తెదేపా అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కినట్లుగానే తెలుస్తుంది. ఈ విషయంపై జగన్ ప్రభుత్వానికి బహిరంగ లేఖ కూడా రాశాడు. అధికారంలోకి వచ్చిన దాదాపు 33 నెలల్లో ఏ ఒక్క నిరుద్యోగ కుటుంబానికి కూడా అటువంటి భృతి ఏదీ అందలేదని ఆయన ఈ లేఖ ద్వారా వివరించాడు. ఇచ్చిన హామీ ప్రకారం చూసుకుంటే.. ప్రతి నిరుద్యోగ కుటుంబానికీ చంద్రబాబు ఇప్పటికి రూ. 66 వేలు ఇవ్వాలని తెలియజేశాడు. ఇంత మొత్తంలో బకాయిలు తీర్చడానికి వచ్చే బడ్జెట్‌లో తప్పకుండా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అందులో కోరడం జరిగింది.
అయితే ప్రతిపక్ష నేత జగన్ లేఖకు మాత్రమే పరిమితం కాకుండా.. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హమీలను నిలబెట్టుకొనేందుకై పోరాటం చేసేందుకు సిద్ధమౌతున్నట్లు అందుతున్న సమాచారం. మొత్తానికి కోదండరామ్ ఎత్తుగడను జగన్ బాగానే అందుపుచ్చుకున్నాడు. అదే విధంగా ఏపీలోని నిరుద్యోగ యువత కూడా ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉంది. ఇందుకోసం పోరాడితే యువత నుండి కూడా మంచి స్పందన రావచ్చన్నది జగన్ ఆలోచనా విధానం కావచ్చు. అందుకనే అధిక మైలేజ్ కోసం జగన్ ఎప్పటికప్పుడు కొత్తదార్లను వెతుకులాడుకుంటూ ముందుకు పోతున్న వైనాన్ని చూస్తుంటే జగన్ అధికారం కోసం గట్టిగానే పోరాడుతున్నట్లు తెలుస్తుంది.