దక్షిణాదిలో పేరు తెచ్చుకున్న హీరోయిన్లు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారు. కానీ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగువెలిగే వారు దక్షిణాదిలో నటించాలంటే వెనకడుగు వేస్తారు. నానా కండీషన్స్ పెడతారు. బాలీవుడ్‌లో బోల్డ్‌గా, అర్ధనగ్నంగా కనిపించే వారు కూడా సౌత్‌కి వచ్చే సరికి ఇంత ఎక్కువ ఇస్తేనే అలా చేస్తాం.. మేము అలా నటించం.. అని నీతులు చెబుతుంటారు. ఇక వారు అడిగే రెమ్యూనరేషన్స్ కూడా బాలీవుడ్‌లో తీసుకునే దానికంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఇదంతా సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. బాలీవులో నటిస్తే ఎక్కువ ఇమేజ్, క్రేజ్ వస్తాయనేది వారి పాలసీ. చివరకు చిరంజీవి నటించిన 150 వ చిత్రంలో కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని ప్రయత్నిస్తే .. బెట్టు చూపించి.. భారీ పారితోషికం డిమాండ్ చేసిందనేది వాస్తవం. తప్పనిసరి పరిస్థితుల్లో తమనే తీసుకుంటారనేది వారి ఉద్దేశ్యం. తమ బాలీవుడ్ చిత్రాల ప్రమోషన్స్ కోసం మన ప్రాంతాలకు వచ్చినప్పుడు మాత్రం తమకు చిరు, పవన్, మహేష్ వంటి వారి సరసన నటించాలని ఉందని కబుర్లు చెబుతారు. అదే బాలీవుడ్‌లోని మీడియా ఎవరైనా సౌత్ హీరోతో నటిస్తున్నారా? అని ఓ హీరో పేరును చెబితే, తమకి అసలు ఆ హీరో ఎవరో కూడా తెలియదంటారు. ఇదో మాయ. ఇక ఇప్పుడు మన స్టార్స్ కూడా పలు ఇండస్ట్రీలను టార్గెట్ చేస్తూ ఉండటంతో అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న హీరోయిన్లనే తీసుకుంటున్నారు. కానీ మహేష్ మాత్రం తాను మురుగదాస్‌తో చేస్తున్న మల్టీ లాంగ్వేజ్ చిత్రంలో తెలుగులో తప్ప పెద్దగా ఇతర భాషల్లో గుర్తింపులేని రకుల్‌ప్రీత్‌సింగ్‌ను తీసుకున్నాడు. ఇక రాజమౌళి తీసిన 'బాహుబలి' అన్ని భాషల్లో, చివరకు బాలీవుడ్‌లో కూడా కనకవర్షం కురిపించింది. కానీ ఇందులోని అనుష్క పెద్దగా బాలీవుడ్‌కి పరిచయం లేదు. తమన్నా తెలిసినా కూడా అక్కడ ఆమెకు ఐరన్‌లెగ్ అనే పేరుంది. రానాకు కూడా కొద్దిగానే గుర్తింపు ఉంది. ప్రభాస్ వారికి చాలా కొత్త. అయినా ఆ చిత్రం అక్కడ బ్రహ్మాండంగా ఆడింది. కాబట్టి కథలో దమ్మండాలే గానీ ఎవరైనా, ఏ భాషలోనైనా తీసినా సినిమా హిట్ అవుతుంది. ఇక నాగ్, మహేష్ వంటి కొందరు స్టార్స్‌తో మాత్రం బాలీవుడ్ హీరోయిన్లు నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇక రజనీ స్టైలే వేరు. ఎందరో టాప్ హీరోయిన్స్ కూడా ఆయనతో కలిసి తెరపై కనిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఆయన హీరో అంటే వెంటనే అంగీకరిస్తారు. ఇది నిజం.. 'రోబో'లో ఐశ్వర్యారాయ్, 'లింగ'లో సోనాక్షిసిన్హా, 'కొచ్చాడయాన్'వంటి ఓ యానిమేషన్ చిత్రంలో దీపికా పడుకొనే వంటి వారు నటించారంటే అది చిన్నవిషయంగా భావించలేం. తాజాగా ధనుష్ నిర్మాతగా రజనీ హీరోగా రంజిత్‌పా ధర్శకత్వంలో రూపొందనున్న 'కబాలి2' చిత్రంలో విద్యాబాలన్ నటించడానికి ఒప్పుకుంది. ఆమె గతంలో చాలా దక్షిణాది చిత్రాలను తిరస్కరించింది. ఆ విషయం బహిరంగంగానే చెప్పింది. ఒకటి రెండు చిత్రాలు చేస్తానని చెప్పి షూటింగ్ ఎగ్గొట్టి అందరినీ నానా ఇబ్బందులు పెట్టింది. కానీ ఆమె రజనీ అనే సరికి ఎగిరి గంతేసి ఎంతిచ్చినా ఫర్వాలేదు.. అని చెప్పి ఆ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. మరో విచిత్రం ఏమిటంటే...... సహజంగా విద్యాబాలన్ ఈ చిత్ర నిర్మాతలకు కండీషన్లు పెట్టాలి. కానీ రజనీ చిత్రం విషయంలో ఆమె నిర్మాతలు పెట్టిన కండీషన్స్‌కు, మరీ ముఖ్యంగా డేట్స్ విషయంలో ఆమెకు విధించిన పలు నిబంధలకు ఆమె మారు మాట్లాడకుండా ఒప్పుకోవడం గమనార్హం.