తాజాగా పవన్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. మంగళగిరిలో ఆయన పర్యటించినప్పుడు ఓ విలేకరి మంచి ప్రశ్న వేశాడు. వారసత్వ రాజకీయాలపై మీ ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నించాడు. దీనికి పవన్ కూడా మంచి సమాధానం ఇచ్చాడు. వారసత్వం తప్పుకాదని, కానీ దానిని బలవంతంగా రుద్దకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఆయన సినిమాలలోకి వచ్చింది చిరు వారసత్వంతో కాదా? రాజకీయాలలో అడుగుపెట్టింది తన అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో కాదా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక్కడ పవన్ వారసత్వాలు తప్పుకాదని, బలవంతంగా రుద్దవద్దని అభిప్రాయం వ్యక్తం చేశాడు. పవన్ చిరు వల్లనే హీరో అయ్యాడు. కానీ అదే పనిగా ఆయన ప్రేక్షకులపై రుద్దబడలేదు. 'తొలిప్రేమ, తమ్ముడు' వంటి చిత్రాల నుంచి తన ట్రెండ్‌ను మార్చివేశాడు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరుని ఎక్కువ కాలం నమ్ముకోలేదు. ఆయనను ఫాలోకాలేదు. తన స్వంత నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు. పరాజయాలు ఎదురైనా తన ప్రయత్నాలు ఆపలేదు. ఇక రాజకీయంగా పవన్ ప్రజారాజ్యంలోకి వచ్చింది నిజమే. కానీ గుడ్డిగా తన అన్నయ్యను ఫాలో కాలేదు. ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంలో చిరు, నాగబాబు, అల్లు అరవింద్‌లను వ్యతిరేకించాడు.
నాగబాబు కాంగ్రెస్‌లో చేరినా పవన్ చేరలేదు. తానే సొంతగా ఓ పార్టీగా జనసేనను పెట్టాడు. తన అన్న ఉన్న కాంగ్రెస్‌ను హఠావో అని నినదించాడు. చంద్రబాబుకు, మోదీకి మద్దతు ఇచ్చాడు. కాబట్టి అతను స్వతంత్ర భావాలు కలిగిన వాడు. అతడిని కేవలం చిరు అభిమానులే కాదు... ఎందరో ఆయన మాటలకు, ఆయన భావాలకు, వ్యక్తిత్వానికి ముచ్చటపడి.. ఆయన వల్లనైనా ఏమైనా సమాజానికి ఉపయోగం ఉంటుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అతను ఎక్కడా అవకాశవాది అనిపించుకోలేదు. కుల, మతాలకు అతీతంగా స్పందిస్తున్నాడు. చిరులాగా ఆయన అమ్ముడుపోలేదు. ఆయనే రాజీ పడి ఉంటే చంద్రబాబు, మోదీల సహకారంతో ఎప్పుడో దొడ్డిదారిన పదవులు తెచ్చుకునే వాడు.
ఆయన అలా చేయలేదు. ఇక వారసత్వాలను రుద్దవద్దని చెప్పాడు. నిజంగానే ఇది అక్షరసత్యం. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకాలలాగా సీఎంలు, పీఎంలు అయిపోవడం, దొడ్డిదారిన త్వరలో ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి పదవిని చేపడుతున్న లోకేష్ వంటి వారే దానికి ఉదాహరణ. కేటీఆర్, హరీష్‌రావు, కవితలు కూడా వారసులే. కానీ వారు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. మరి లోకేష్‌కే ప్రతిభ ఉంటే ఏపీలో కాదు.. తెలంగాణను లోకేష్‌కి అప్పగించి, తెలంగాణాలో దీనంగా ఉన్న టిడిపికి పూర్వవైభవం తేవడం కోసం చంద్రబాబు లోకేష్‌కు పగ్గాలు అప్పగించవచ్చు కదా...! ఆయన కేవలం చంద్రబాబు తనయుడే గానీ ఆయనకంటూ గొప్ప ఆదర్శాలు లేవు. చంద్రబాబు తర్వాత టిడిపిని బాలకృష్ణ గానీ, మిగిలిన టీడీపీ నాయకులు గానీ, లోకేష్ గానీ ఏపీలో కూడా బతికించుకోలేరు.. ఆ సత్తా వారికి లేదనేది వాస్తవం.