తమిళ ప్రజలు బాగా ఇష్టపడుతున్న పన్నీర్‌సెల్వంను నిందిస్తూ, శశికళకు మద్దతు తెలుపుతూ తాజాగా రాములమ్మ విజయశాంతి కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పన్నీర్‌ను ఆమె ఓ దుష్టశక్తిగా పోల్చి, చిన్నమ్మ మాత్రమే పార్టీని నడపగలదని, ఆమె సీఎం కావాలని కోరుకుంటున్నానని రాములమ్మ వ్యాఖ్యానించింది. నటిగా విజయశాంతికి కూడా తమిళనాడులో మంచి ఆదరణ ఉంది. ఏకంగా ఆమె నటించిన ఎన్నో తెలుగు చిత్రాలను డబ్బింగ్ చేశారు. దాంతో ఆమెకు తమిళనాడులో కూడా మంచి క్రేజ్ వచ్చింది. అది ఏ రేంజ్‌కు వెళ్లిదంటే బాలకృష్ణతో కలిసి విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ఓ చిత్రాన్ని తమిళంలో హీరోయిన్ ఓరియంటెడ్‌గా ప్రచారం చేసి, ఆ సినిమా టైటిల్‌ను కూడా రాములమ్మ పేరు మీద పెట్టి, ఆమె ఫొటోలు, కటౌట్లతో తమిళంలో బాగా క్యాష్ చేసుకున్నారు.
కానీ ప్రస్తుతం ఈ లేడీ అమితాబ్ చేసిన వ్యాఖ్యలపై తమిళ నటీనటులు, సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా కూడా కమల్‌తో పాటు పలువురు ఈ విషయాన్ని పెద్దది చేసి విజయశాంతికి క్రేజ్ తేవడం ఇష్టం లేక మౌనంగా ఉన్నారు. దీనిపై చాలా మంది రాములమ్మపై లోలోపల మండిపడుతున్నారు. తాజాగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అయిన వసంతన్ మాత్రం బహిరంగంగా శాంతికి చీవాట్లు పెట్టాడు. ఆయన మాట్లాడుతూ, విజయశాంతి ఏమైనా పొలిటికల్ లెజెండా? ఆమె కావాలనుకుంటే తన రాష్ట్రం గురించి, అక్కడి రాజకీయాల గురించి మాట్లాడమనండి. అంతేకానీ తమిళ రాజకీయాల జోలికి వస్తే ఖబడ్దార్ అని వార్నింగ్ ఇస్తూ కొసమెరుపుగా ఇదేమీ సినిమా కాదు.. ఇది తమిళ ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన అంశం అని చెబుతూ, రాములమ్మను ఏకిపారేశాడు. మరి దీనిపై శాంతి ఎలా స్పందిస్తుందో చూద్దాం..!