కొందరు ప్రతి దానిని రాజకీయం చేస్తుంటారు. ఇందులో రాజకీయనాయకులే ఎక్కువగా ఉంటారు. వారుండేది రాజకీయాలలో, బతికేది, సంపాదించేది అంతా దానిలోనే కాబట్టి వారు చేసే వ్యాఖ్యలకు ప్రజలు కూడా పెద్దగా రెస్పాండ్ కావడం మానివేశారు. ఇక నాగార్జునకు కాబోయే కోడలు సమంత తెలంగాణ రాష్ట్రానికి చేనేత అంబాసిడర్‌గా ఒప్పుకున్నందుకు సినీజోష్ దానిని మెచ్చుకుంటూనే కొన్ని ప్రశ్నలు వేసింది. ఆమె ఏపీకి కూడా ఎందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేయదు? ఎంతమందైనా బ్రాండ్ అంబాసిడర్లు ఉండవచ్చు. అందులో తప్పేమి కాదు.. అని తెలిసినా... కేసీఆర్, కేటీఆర్‌లకు నాగ్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలపై ప్రశ్నలు సంధించింది. అందుకు నాగ్ అభిమానులు బాధపడినా కూడా ఆ ప్రశ్నలో నిజం ఉంది.
కాగా ప్రస్తుతం తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత అయిన షబ్బీర్‌అలీ కూడా అదే విషయంపై కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శిస్తూ, వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో కూడా తప్పులేదు. కానీ తాజాగా షబ్బీర్‌అలీ నోరుజారాడు. ఆయన వ్యాఖ్యానిస్తూ, తెలంగాణ మహిళలకు చీరలు కట్టుకోవడం రాదా? సమంత వచ్చి తెలంగాణ మహిళలకు చీరలు ఎలా కట్టాలో నేర్పించాలా? అంటూ అసలు సమంతకు చీరకట్టడమే రాదన్నటుగా కించపరిచి మాట్లాడారు.
కానీ ఇలాంటి విమర్శలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తాయేగానీ ఎలాంటి మేలు చేయవు. కాంగ్రెస్ చేయలేని పనిని టీఆర్‌ఎస్ చేసింది. సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంలో తప్పేముంది? మరి ఏ ప్రభుత్వం పిలవక పోయినా, పవన్‌కల్యాణ్ ఈ రోజు చేనేత కార్మికుల వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన, లేదా ఎవరైనా సెలబ్రిటీలు ముందుకు వచ్చినా.. దానిని తప్పుంటే హుందాగా విమర్శించాలే గానీ, సమంతకు చీరలు కట్టడం వచ్చా? అనేంత నీతి బాహ్యమైన రాజకీయ వ్యాఖ్యలను మానుకోవాల్సివుంది.