జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో చేనేత సత్యాగ్రహ సభకు హాజరయిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సత్యాగ్రహం చేస్తున్న వ్యక్తులకు పవన్ తన సంఘీభావాన్ని ప్రకటించి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... సత్యాగ్రహం అంటే ప్రజల్లో నుండి వచ్చే నిజమైన ఆగ్రహం అని, ప్రస్తుతం చేనేత పరిశ్రమ మొత్తం కదలి రోడ్డు మీదకు వచ్చి చేస్తున్నది అదేనని ఆయన తెలిపాడు. నిజంగా తన దృష్టిలో చేనేత వారు, కార్మికులు, కూలీలు కాదని, వాళ్ళు నిజమైన కళాకారులని ప్రస్తుతం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టే తాను చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని అన్న సందర్భంలో కొంతమంది తనను అన్నం పెట్టేవారిని వదిలేసి ఎంగిలాకులు ఏరుకునే వారి వద్దకు వెళతారేంటి అని ఎద్దేవా చేశారని ఆయన వెల్లడించాడు.
కాగా పవన్ ఈ విషయంపై స్పందిస్తూ... ఆ మాటలు తనకు భాధ కలిగించలేదు, అప్పుడు తాను దేవుడు తనకు శుభ్రం చేసే వృత్తినైనా ఇచ్చినందుకు సంతోషించానని భావించినట్లు వివరించాడు. ఇంకా పవన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో.. ఈ చేనేత కళాకారులకి ఇచ్చిన మాటలను గుర్తు పెట్టుకోవాలని ఆయన తెలిపాడు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి వీరి బాగు కోసం పని చేయాలని ఆయన వ్యాఖ్యానించాడు. ఇంకా పవన్ వీరిపై స్పందిస్తూ.. పవర్ లూమ్స్ ద్వారా వీరి ఆదాయాన్ని దోచుకుంటున్న వారిని ప్రభుత్వం ఎందుకు నిలుపు చేయలేకపోతుందని ఆయన వివరించాడు. ప్రతి చేనేత సభ్యుడు ఈ సమస్యలన్నింటినీ మానిటరింగ్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ వివరించాడు.
ఇంకా పవన్ కళ్యాణ్ తన రాజకీయాలు, జనసేన పార్టీ గురించి ప్రస్తావించాడు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, అధికారం ఉంటేనే సేవ చేస్తామనుకోవడం చాలా పొరపాటని, అది అసమర్ధత కలిగిన వాక్యంగా ఆయన తెలిపాడు. తాను 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అప్పుడు చేనేత కళాకారుల గొంతుకను అసెంబ్లీలో బలంగా వినిపిస్తానని ఆయన తెలిపాడు. చివరగా పవన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా వారానికి ఒక్కరోజు చేనేత వాడితే వారి సమస్యలన్నీ తీరుతాయని పవన్ కళ్యాణ్ తెలిపాడు. కాగా తాను బ్రతికున్నంత కాలం చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని పవన్ కళ్యాణ్ గంభీరంగా వెల్లడించాడు.