సినిమా ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్, ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చే ఇంటర్వ్యూల నుంచి అన్నింటిలో ఒకరి మీద మరొకరు పొగడ్తలు గుప్పించడం, ఒకరిని వేరొకరు ఆకాశానికి ఎత్తేయడానికే సమయం సరిపోతుంది. వాస్తవానికి ఈ పొగడ్తలను, భజనలను సినిమా నిజమైన హిట్ అయి, నిర్మాతలకు లాభాలు వచ్చినప్పుడు చేయాల్సిన పని. కానీ మన సినిమా వారు ప్రారంభం నుంచే పొగడ్తలు గుప్పిస్తారు. సినిమా తేడా వచ్చిందంటే చాలు ఒకరి మీద ఒకరు వంకలు చూపుతుంటారు. ఫలానా సినిమా వల్ల ఇంత నష్టపోయాం.. అంత నష్టపోయాం అని మనస్పర్థలు తెచ్చుకుంటూ ఉంటారు. వీలుంటే మీడియాను కూడా వివాదంలోకి లాగి క్లాస్‌లు పీకుతుంటారు. ఒక హీరో స్టామినాకు, మార్కెట్‌కు అనుగుణంగా బడ్జెట్‌ను పెట్టకుండా ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆ తర్వాత సినిమాకి నష్టాలు వస్తే మంచి చిత్రం తీసినా జనాలు చూడలేదంటూ వారిపై నెపాన్ని వేస్తారు. ఇక వారసుల, ఫ్యామిలీ హీరోల చిత్రాల విషయానికి వస్తే పొగడ్తలకు, ఒకరి గురించి ఒకరు, ఎవరి ఫ్యామిలీల గురించి వారు, ఎవరి వంశాల గురించి వారు చెప్పుకుంటారు. కొందరు భజనాపరులు మరింత ముందడుగు వేసి మహామహానటులు నటించిన కళాఖండాలను సైతం ఆయా పుత్రరత్నాల సినిమాలతో పోలుస్తూ ఉంటారు.
ఇక విషయానికి వస్తే మెగామేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్‌తేజ్ మార్కెట్ అటు ఇటుగా 20కోట్లు మాత్రమే ఉంది. కానీ ఆయన తాజాగా నటిస్తున్న 'విన్నర్' చిత్రాన్ని నిర్మాతలు ఎక్కువ బడ్జెట్‌ను పెట్టి తీశారు. కేవలం ఆర్టిస్టుల రెమ్యూనరేషన్‌కి, ఫారిన్ లోకేషన్స్‌కి, ఇతర టెక్నీషియన్స్‌కు అంతా కలిపి ఏకంగా 25 కోట్ల వరకు ఖర్చయిందని సమాచారం. దీనిని నిర్మాతలు, ఆయా హీరోలు, వారి వారి బందువులు పొగడ్తల వర్షం కురిపించి, గర్వంగా చాటుకున్నారు. ఇక సాయిని అయితే అప్పుడే మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌లతో పోల్చేశారు. బన్నీతో సరే అనుకున్నా చిరు, పవన్‌ల స్థాయిలో తేజ్‌ని పొగడటం తప్పు. ఇక పెద్దగా రామ్‌చరణ్ సంగతి ప్రస్తావనకు రాలేదు. మరో మెగాహీరోగా వైవిద్యమైన చిత్రాలు తీసి తన నటనాపాటవాన్ని చూపిస్తున్న వరుణ్‌తేజ్‌పై కూడా ఇంతగా పొగడ్తలు లేవు. నాని, రవితేజ, శర్వానంద్ వంటి వారికి కూడా ఇంత గొప్ప పొగడ్తలు రాలేదు. మరి ఈ పద్దతి ఏమిటో అర్ధం కాని బ్రహ్మపదార్ధం. మరి మేమే డబ్బులు ఖర్చుపెట్టిన ఫంక్షన్, సినిమాలో ఎవరినో ఎందుకు పొగడతాం? మరి మిమ్మల్ని పొగడాలా? అని ప్రశ్నించే వారికి మన వద్ద సమాధానం లేదులేండి. ఇక 'విన్నర్' విషయానికి వస్తే ఈ చిత్రం బడ్జెట్ 25కోట్లు కాగా 30కోట్ల బిజినెస్ చేసిందట. అంటే ఈ చిత్రానికి 30కోట్లకు పైగా వస్తేనే ఈ చిత్రం హిట్ కింద లెక్క. మరి చూద్దాం.. నాటి 'విజేత' అయిన మెగాస్టార్‌లా నేటి 'విన్నర్' కూడా విజయం సాధిస్తాడో లేదో...? నష్టం వస్తే ఎవరు ఎవరి మీద నిందలు వేసుకుంటారో? వెయిట్ అండ్ సీ....!