సాయి ధరమ్ తేజ్ తన మామయ్యలను ఏ ఫంక్షన్ లో అయినా సరే తెగ పొగిసేస్తూ ఉంటాడు. కారణం అతను మెగా ఫ్యామిలీ హీరో అవడమే. ఇంకా మెగా ఫ్యాన్స్ దృష్టి తన మీద ఎప్పుడూ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. తాను మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనా ఇంకా చిన్న హీరోగానే మిగిలిపోయాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ రేంజ్ కి ఇంకా రాలేదు కాబట్టే... సాయి తన ఏ ఫంక్షన్ లో అయినా కూడా మెగా మామయ్యలు ఎవరో ఒకరు అటెండ్ అయ్యేలా చూసుకుని సక్సెస్ అవుతుంటాడు. ఇక వారు గనక రాకపోతే వారు గురించి గొప్పగా చెబుతుంటాడు.
తాజాగా 'విన్నర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా సాయి ధరమ్ తేజ చిన్న మామయ్య ఎప్పుడో తనకు చెప్పిన సంగతులు గుర్తు చేసుకుని మరీ వినిపించాడు. అదేమిటంటే తనకు మా టీవీ అవార్డు వచ్చిందని పవన్ మామయ్యకి ఫోన్ చేసి చెబితే ఆయన అప్పుడు నాతో... అవార్డులు గెలవడం... విజయం సాధించడం కాదు.. ఒక ఓటమిని మనం ఫేస్ చేసినప్పుడు మన చుట్టూ ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి మనం గెలిచామా.. లేదా.... అనేది ఆధారపడి ఉంటుంది. అని చెప్పాడు. అయితే నాకు ఆ విషయం అప్పుడు అర్ధం కాకపోయినా 'తిక్క' సినిమా పరాజయం అయినప్పుడు అర్ధమయ్యింది. ఆ సినిమా ప్లాప్ అయినప్పుడు నా ఫ్రెండ్, శ్రేయోభిలాషులు, మెగా ఫ్యాన్స్ నాకు అండగా నిలబడి ధైర్యం చెప్పారని చెప్పాడు. అందుకే పవన్ మామయ్య చెప్పిన మాటలు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటానని చెప్పాడు సాయి.
ఇంకా 'విన్నర్' గురించి మాట్లాడుతూ తన మార్కెట్ గురించి ఆలోచించకుండా నా మీద నమ్మకంతో నా సినిమాకి ఇంత భారీ పెట్టుబడిపెట్టిన నిర్మాతలకు థాంక్స్ చెప్పాడు. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనని ఒక తమ్ముడివలె చూసుకున్నాడని చెప్పాడు.