ప్రస్తుతం ప్రశ్నించడమే హక్కుగా భావిస్తున్న పవన్ పలు విషయాలపై కేంద్రంలోని బిజెపిని, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రత్యేకహోదా నుంచి ఉద్దానం కిడ్నీ బాధితుల వరకు ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఎందరినో ఆకర్షిస్తున్నాయనేది వాస్తవం. ఆయన లేవనెత్తే ప్రశ్నలకు బిజెపి నాయకులు, టిడిపి నాయకులు డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారే గానీ అసలు పాయింట్‌ని మాత్రం కప్పిపుచ్చలేకపోతున్నారు. పవన్ ఇప్పటికే చేనేత కార్మికుల సమస్యలను ప్రస్తావించి, వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడానికి ముందుకొచ్చాడు. పవన్ విషయాన్ని పక్కనపెడితే తెలంగాణ ప్రభుత్వం కూడా తాజాగా చేనేత కార్మికుల కోసం సీఎం కేసీఆర్ అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ విషయంలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను మెచ్చుకోవాలి. కాగా తాజాగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు చేనేత కార్మికుల కష్టాలు ఇప్పుడే తెలిసినట్లున్నాయి. దాంతో ఆయన హడావుడిగా చేనేత వస్త్రాలను, కార్మికులను సమర్థిస్తూ ప్రసంగాలైతే చేశారు. కానీ దానికి సరైన చర్యలు తీసుకోకుండా కేవలం మాటతోనే సరిపెట్టాడు. ఇంతకీ కొల్లురవీంద్ర అంత అర్జెంట్‌గా చేనేత కార్మికులపై ప్రేమ చూపించడానికి కూడా పెద్ద కారణమే ఉంది. పవన్ ఈ రోజు గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో చేనేత కార్మిక సంఘాలు చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షకు రానున్న సమయంలోనే కొల్లు రవీంద్ర అంతగా రియాక్ట్ అయ్యాడనిపిస్తోంది.
మొత్తానికి అది పవన్ వల్లనా? లేక మరో కారణమా? అనేది పక్కన పెడితే చేనేత కార్మికుల సమస్యలకు కృషి చేస్తే అదే పదివేలు. ఇక్కడ దాని ద్వారా ఎవరికి పొలిటికల్ మైలేజీ వస్తుందనే విషయం అప్రస్తుతం. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం హర్షణీయం. ఇక పవన్ ఈ దీక్ష మద్దతు సందర్భంగా ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? వారి కష్టాలు తీర్చడానికి ఏయే డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడతారో వేచిచూడాల్సివుంది.