నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని నందమూరు బాలకృష్ణ... ఓ చిత్రం రూపొందిస్తానని, అందులో తాను నటిస్తానని వెల్లడించడంతో రాజకీయ వర్గాల్లో వేడి రాజుకుంది. పెద్దాయనపై సినిమా అనగానే చాలా మంది రాజకీయ వేత్తల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నవి. ఎవరికి వారు ఆయన సినిమాలో తమ చరిత్రకు సంబంధించిన విషయాలు ఉంటాయేమోనని కంగారుపడుతున్నారు. ఆయన జీవితంలోని వివాదాలను సినిమాలో టచ్ చేసేట్టయితే తమ గురించి నెగెటివ్ గా చూపిస్తారని సంబంధికులంతా ఎవరి భుజాలు వారు తడుముకుంటున్నారు. అందులో ముఖ్యంగా.. నాదెండ్ల భాస్కరరావు, లక్ష్మీ పార్వతి తమని ఆ సినిమాలో నెగెటివ్‌గా చూపిస్తే కోర్టుకు వెళతామని వారిద్దరూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే నాదెండ్ల వివిధ చానళ్లలో జరిపిన ముఖాముఖిల్లో మాట్లాడుతూ.. 'మొదట్లో తెలుగు దేశం పార్టీకి అన్నీ నేనై పార్టీని ప్రారంభిస్తే.. అధ్యక్షుడిని చేయమని ఎన్టీఆర్ వచ్చి తనను బలవంతం చేశాడు. అందుకే అప్పట్లో ఎన్టీఆర్ ను అధ్యక్షుడిని చేశాను. కానీ.. ఆ తర్వాత ఎన్టీఆర్ తనను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు' అని నాదెండ్ల తెలిపాడు. అప్పట్లో మీడియా తనను విలన్ గా చిత్రించడంలో పైచేయి సాధించిందని నాదెండ్ల వ్యాఖ్యానించాడు.
అసలు బాలకృష్ణకు ఎన్టీఆర్ గురించి గానీ, తెదేపా ఆవిర్భావం గురించి గానీ ఏం తెలుసు, అప్పటికి ఆయన చిన్న కుర్రాడు. అందుకనే బాలకృష్ణ, ఎన్టీఆర్ పై సినిమా తీసేముందు తనను కలిస్తే ఆ సినిమా ఎలా రూపొందించాలో చెప్తానని నాదెండ్ల తన మనసులో మాటను వెల్లడించాడు. ఆ విషయంపై ఇప్పుడు అంతటా ప్రముఖంగా చర్చ జరుగుతుంది.ఇంకా నాదెండ్ల భాస్కరరావు మాట్లాడుతూ.. మొదట్లో ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచాడు కాబట్టే ఆ తర్వాత తాను వెన్నుపోటు రాజకీయాలు చేయాల్సి వచ్చిందని నాదెండ్ల తన మనసులో మాటను బయటపెట్టాడు. అందుకనే తనను ఎన్టీఆర్ ఆటోబయోగ్రఫీలో నెగెటివ్ రోల్ లో చూపిస్తే తప్పుకుండా తాను కోర్టుకు వెళతానని నాదెండ్ల సీరియస్ గా వ్యాఖ్యానించాడు.
ఇంకా నాదెండ్ల భాస్కరరావు మాట్లాడుతూ.. అసలు ఎన్టీఆర్ జీవితంలో విలన్ చంద్రబాబు నాయుడని టకీమని చెప్పేశాడు. స్వయంగా ఎన్టీ రామారావుకి అల్లుడయి ఉండి చంద్రబాబే వెన్నుపోటు పొడిచాడు. అదీ ఎన్టీఆర్ కు ఉన్న అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా.. వెన్నుపోటు పొడిచాడు. ఇంకా.. చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తాడని ఎన్టీఆర్ స్వయంగా వ్యాఖ్యానించిన సంగతి గురించి వెల్లడించాడు. కాబట్టి ఎన్టీఆర్ జీవిత చరిత్రకి చంద్రబాబే అసలైన విలన్ అని నాదెండ్ల ఘాటైన విమర్శలు చేశాడు. అప్పడు ఇప్పుడుగానీ తాను ఈ విషయాన్ని ఎన్నిమార్లు వెల్లడించినా మీడియా మాత్రం ఏ మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరించిందని నాదెండ్ల ఒకింత సీరియస్ గా వెల్లడించాడు.