తమిళనాట రాజకీయాలు బాగా చురుకుగా సాగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో జరిపిన బలపరీక్షలో పళని స్వామికి 122 ఓట్లు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు 11 ఓట్లు రావడంతో పళని స్వామి విజయం సాధించినట్లు స్పీకర్ ధన్పాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర అసహనానికి లోనైన పన్నీరు సెల్వం కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. బలపరీక్ష కారణంగా వేరుపడ్డ పన్నీరు సెల్వం వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసే ప్రమాదం పొంచి ఉన్నందున ఏ క్షణంలోనైనా పన్నీరు సెల్వం అమ్మాడీఎంకే పేరుతో కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇందుకు సంబంధించిన పన్నీరు సెల్వం తన వర్గం వారితోనూ, తనకు అత్యంత సన్నిహితులైన వారితోనూ తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో బలపరీక్ష ముగిసిన తర్వాత పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. పళనికి ఓటు వేయడం అంటే అమ్మకు ద్రోహం చేయడం వంటిదేనిని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. అయితే తన పోరాటం ఇంకా ముగియదని ఇక ప్రారంభిస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. అదే సందర్భంగా రహస్య ఓటింగ్ కు స్పీకర్ నుండి అనుమతి రాకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టాడు. అయితే శశికళకు వ్యతరేకంగా తమిళనాడు అంతా పర్యటించి ప్రచారం చేస్తానని వివరించిన ఆయన ధర్మం తప్పక గెలుస్తుందని తెలిపాడు. ఎప్పుడూ సాధు జీవిలా తన పని తాను సైలెంట్ గా చేసుకుపోయే పన్నీరు సెల్వం ఇంత తీవ్రంగా హెచ్చరించాడంటే ఈ వ్యాఖ్యల వెనుక కొత్త పార్టీ పెట్టే ఆలోచన తప్పక దాగి ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అప్పుడే సెల్వం అందుకు సంబంధించిన స్కెచ్ ని రూపొందించుకుంటున్నట్లు తెలుస్తుంది. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖలతో పళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయించుకోవడం వంటివి మొదలెట్టారు. అంతే కాకుండా ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పలు రకాలుగా వ్యూహాలను పన్నేందుకు సెల్వం సిద్ధమౌతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తమిళనాడు సీఎం పళనిస్వామి చాలా కీలకమైన గండం నుండి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం తమిళనాడులోని ప్రతిపక్ష నేత అయిన ఎంకె స్టాలిన్ అసెంబ్లీ నుండి సరాసరి రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేశాడు. అదేంటంటే.. ప్రతిపక్షంలో ఉన్న సభ్యులందరినీ బలవంతంగా బయటకు పంపించి ఫ్లోర్ టెస్ట్ ఎలా జరుపుతారన్నదే ఇందులోని చిక్కు ప్రశ్న. రహస్య ఓటింగ్ చేపట్టమన్న తమ డిమాండ్ ను స్పీకర్ ఏమాత్రం పట్టించుకోలేదని స్టాలిన్ అందులో ఫిర్యాదు చేశాడు. కాగా ఈ విషయంలో గవర్నర్ జోక్యం తప్పక చేసుకొనే అవకాశాలు సైతం లేకపోలేదన్నది న్యాయవేత్తలు అంటున్నారు.
గవర్నర్ పట్టించుకుంటే.. అసెంబ్లీ నుండి వీడియో ఫుటేజ్ తెప్పించుకుని, పరిశీలించి బలపరీక్ష సక్రమ పద్ధతిలో జరిగిందా లేదన్నది చూస్తారు. అందులో ఏమాత్రం పొరపాటు చోటుచేసుకున్నా గవర్నర్ ముఖ్యమంత్రికి నోటీసులు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా సభలో జరిగిన ‘తంతు’ పై విచారణకు సైతం ఆదేశించవచ్చు. తేడా వస్తే మళ్లీ పరీక్షలు జరపాలని ఆదేశాలివ్వడమే కాకుండా.. ఈసారి రాజ్ భవన్ నుండి తన పర్యవేక్షకులను పంపుతారు. కాబట్టి తమిళనాడులో ఇప్పుడు గట్టిగా జరుగుతున్న ప్రాచరం ఏంటంటే.. ఈ ప్రభుత్వం మళ్లీ బలపరీక్షకు సిద్ధం కావడం ఖాయం అని.