జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుస్తకాల పురుగు. ఆయన కమ్యూనిజానికి చెందిన, అలాగే తత్త్వవేత్తలకు చెందిన గొప్ప గొప్ప పుస్తకాలను చదివే అలవాటు చిన్నప్పటి నుండి ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ కు దివంగత కమ్యూనిస్టు పార్టీ నేత తరిమెళ్ల నాగిరెడ్డి ఆలోచనలపైన, ఆయన రచించిన పుస్తకాలపైనా మమకారం ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే.. చాలా సందర్భాల్లోనూ, బహిరంగ సభల సాక్షిగా పవన్ కళ్యాణ్ తరిమెళ్ళ నాగిరెడ్డిని స్మరించుకున్న విషయం తెలిసిందే. అయితే... తాజాగా పవన్ తరిమెళ్ళను గుర్తు చేసుకున్నాడు. తరిమెళ్ళ నాగిరెడ్డి శత జయంతి సంవత్సరం సందర్భంగా పవన్ ఆయన్ని స్మరించుకున్నాడు. పవన్ తాజాగా ట్వీట్ చేస్తూ.. 'నా చిన్నతనంలో జరిగిన ఓ విషయం గుర్తుకువస్తుంది. నేను ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడు తరిమెళ్ళ నాగిరెడ్డి రచించిన ‘తాకట్టులో భారత దేశం’ పుస్తకాన్ని చదవమని కొందరు ఇచ్చారు.
అప్పుడు నాగిరెడ్డి ఆలోచనా విధానం, విషయం పట్ల గంభీరత, ఎంతో లోతైన అధ్యయనం ఆ పుస్తకం ద్వారా నేను గ్రహించలేకపోయాను. కానీ అప్పట్లోనే ఆయన ఆ పుస్తకం ద్వారా వెల్లడించిన భావాలు, అభిప్రాయాలు, అన్ని విషయాలు కూడా నేటి కాలానికి సరిగ్గా సరిపోతాయి. ఇంకా చెప్పాలంటే తరిమెళ్ళ నాగిరెడ్డి పీడిత ప్రజల హక్కుల కోసం చాలా ఎక్కువగా దృష్టి సారించారు. ఇంకా ఎమ్మెల్యేగా 3 సార్లు, ఎంపీగా ఒకసారి పని చేశారు. అంతే కాకుండా భూమిలేని నిరుపేదలకు 1000 ఎకరాలను దానం చేసిన గొప్ప ఉదార స్వభావం కలిగిన మహా వ్యక్తి తరిమెళ్ళ నాగిరెడ్డి' అని పవన్ ఆయనను కొనియాడారు. ఈ శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని దివంగత తరిమెళ్ళ నాగిరెడ్డికి తల వంచి నమస్కరిస్తున్నానంటూ పవన్ ట్విట్టర్ వేదికగా తరిమెళ్ళ నాగిరెడ్డిని స్మరించుకున్నాడు.