ప్రస్తుతం ఓ రాష్ట్ర ఉక్కుమహిళగా పేరుతెచ్చుకున్న వనిత ఓ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, పారదర్శకంగా ఉంటూనే, రాజకీయాలకు అవసరమైన నిధులు సేకరించేందుకు ప్రజల నుంచి స్వచ్ఛంధంగా 10రూపాయలను తీసుకోవాలని నిర్ణయించింది. ఇది చాలా మంచి నిర్ణయం. ఎవరెన్ని చెప్పినా చేతిలో డబ్బులు లేకుండా రాజకీయ సభలు, సమావేశాలు వంటివి వీలుకావు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నించే నాయకులు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తే మంచిదే. దీని ద్వారా ప్రజలను కూడా మనం భాగస్వాములను చేయగలం. అలాగే కోట్లాది రూపాయల విరాళాలను బడా బడా పారిశ్రామికవేత్తల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి తీసుకుంటే అది భవిష్యత్తులో ఎన్నో ముప్పులను తెచ్చిపెడుతుంది. ఆయా వ్యక్తులు, సంస్థల చేతిలో కీలుబొమ్మలుగా మారాల్సిందే.
ఎంత నిజాయితీపరులకైనా ఇది తప్పడం లేదు. దానికి మోదీనే ఉదాహరణ. కాబట్టి పపన్‌కళ్యాణ్ వంటి అవినీతి, కుల, మత రహిత సమాజాన్ని కోరుకునే వారు ప్రజల్లోకి వెళ్లి వారి ద్వారా పదో పదిహేనో రూపాయలను విరాళంగా తీసుకుని పార్టీని పటిష్ట పరిచి, పార్టీలకు ఫండ్‌ను సాధించుకోవచ్చు. ఇక రాజకీయాలలో కూడా సొంత డబ్బులను, కష్టపడి సంపాదించిన నీతివంతమైన డబ్బును పెట్టమని, బికారులుగా నిలవమని ఎవ్వరూ చెప్పరు. అలా ఖర్చుపెడితే, రేపు దానిని ఎలా రాబట్టుకోవాలా? అనే దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి. కాబట్టి పార్టీ స్థాపనకోసం ప్రజల నుంచే స్వచ్చందంగా విరాళాలు సేకరిస్తూ, పారదర్శకతను చాటితే తప్పులేదు. ఇక ఎన్నికల ముందే ఇలాంటి విరాళాల వల్ల ఆయా రాజకీయపార్టీలకు, నాయకులకు ప్రజల్లో ఎంత మద్దతు ఉందో కూడా వచ్చే విరాళాలను బట్టి అంచనా వేసుకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ వంటి వారు మన రాష్ట్రంలో కూడా అలాంటి పనిచేస్తే సంతోషించాల్సివుంది. మరి ఈ దిశగా ఎవరు ముందు అడుగువేస్తారో వేచిచూడాల్సివుంది....!