మోదీని దేశప్రజలు ప్రధానిగా చూడాలని కలలు కన్నారు. ఇక వెంకయ్యనాయుడుని ఏపీకి ఆశాజ్యోతిగా భావించారు. కానీ కొన్ని కొన్ని విషయాలలో మాత్రం వీరి ప్రవర్తన.. మాటల తీరు బాగా ఉండటం లేదు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, బిజెపిలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన పలు సభలలో మోదీతో పాటు హజరైన చంద్రబాబు రైతులకు రుణమాఫీ అని ప్రకటించాడు. ఇక ఆ తర్వాత కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత అసలే లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీలో రైతుల రుణమాఫీకి ఎన్నోఅడ్డంకులు, ఆర్ధిక సమస్యలు తలెత్తాయి. మరి కేంద్రంలో ఉన్న మీమాటేమిటి.. రైతుల రుణమాఫీకి కేంద్రం కూడా రాష్ట్రానికి ఏమైనా సాయం చేస్తుందా? అని కొందరు మీడియా వారు బిజెపి నాయకులైన వెంకయ్యతో సహా ఎందరినో ప్రశ్నించారు.
కానీ తాము రైతు రుణమాఫీకి వ్యతిరేకమని, బిజెపి దృష్టిలో అది రైతులను మోసం చేయడమేనన్నది తమ పార్టీ సిద్దాంతంగా వెంకయ్య చెప్పుకొచ్చారు. ఇందులో ఎంతో వాస్తవం కూడా ఉంది. కానీ తాజాగా జరిగిన, జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్వయాన మోదీ ఆ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తానని వాగ్డానం చేశాడు. మరి ఇది ఎలాంటి ద్వందనీతి అనేది అర్ధమవుతోంది. ఇక యూపీకి తాను దత్తపుత్రుడినని ప్రకటించకున్న మోదీ దాదాపుగా తన మాటలలో తాను శ్రీకృష్ణుని వంటి వాడినని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చారు.
ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం తమకు ప్రత్యేకమైందని చెప్పడం మోదీకి, ఆయన అనుచరులైన వెంకయ్య వంటి వారికి అలవాటైపోయింది. ఏపీకి వస్తే ఏపీ తమకు ప్రత్యేక రాష్ట్రం అంటారు.తెలంగాణకు వెళితే అక్కడ, యూపికి వెళితే అక్కడ.. ఇలా ఎక్కడైనా తమ మాటల చాతుర్యంతో వారు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మోదీ వంటి బలమైన నాయకుడు కూడా ఇలా చేయడాన్ని ఎందరో జీర్ణించుకోలేకపోతున్నారు.