Advertisementt

ఆ'చారి' ట్రెండ్‌కు పునాది పడింది ఎప్పుడు?

Sun 19th Feb 2017 01:08 PM
dj,duvvada jagannadham,tollywood heroes,brahmin roles,kamal haasan  ఆ'చారి' ట్రెండ్‌కు పునాది పడింది ఎప్పుడు?
ఆ'చారి' ట్రెండ్‌కు పునాది పడింది ఎప్పుడు?
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్‌ నడుస్తూ ఉంటుంది. నిన్నటివరకు అందరూ దర్శకుడు శ్రీనువైట్ల టైప్‌ బకరా చిత్రాలను తీస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా మన స్టార్స్‌కి 'చారి' ట్రెండ్‌ పట్టుకుంది. 'అదుర్స్‌' చిత్రంలో ఎన్టీఆర్‌ నటించిన 'చారి' పాత్ర ఎంతగా పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలోని ఆ పాత్ర ఎన్టీఆర్‌లోని పూర్తిస్థాయి కామెడీ కోణాన్ని ఆవిష్కరించింది. ఈచిత్రం విడుదలై ఏడేళ్లు దాటినా కూడా ఈ పాత్ర ఇప్పటికీ అందరినీ వెంటాడుతూనే వస్తోంది. కాగా ప్రస్తుతం మన హీరోలు ఇదే తరహా చిత్రాల వైపు, పాత్రల వైపు చూస్తున్నారు. తాజాగా విడుదలైన అల్లుఅర్జున్‌-హరీష్‌శంకర్‌-దిల్‌రాజుల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'డిజె' (దువ్వాడ జగన్నాథం)లో బ్రాహ్మణుడి వేషధారణలో ఉన్న బన్నీ బజాజ్‌ స్కూటర్‌పై అగ్రహారం బ్యాక్‌డ్రాప్‌లో కూరగాయలు తీసుకొచ్చే స్టిల్‌ చూస్తే మనకి ఈ పంతులుగారు 'చారి'లా అనిపించడం తప్పేమికాదు...! ఈ చిత్రంలో బన్నీ ఓ చారి వంటి పాత్రను చేయనున్నాడని సినిమా మొదలైనప్పటి నుంచి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కొందరు వీటిని ఒట్టి పుకార్లుగా భావించారు. కానీ విడుదలైన 'డిజె' ఫస్ట్‌లుక్‌తో ఆ విషయం కన్పర్మ్‌ అయింది. ఇక ఈ చిత్రం కథ కూడా 'అదుర్స్‌'కు సీక్వెల్‌గా ఉండనుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌తోనే వినాయక్‌ 'అదుర్స్‌ 2' చేయాలని భావించినా కూడా దానికి తగ్గ స్టోరీ మాత్రం దొరకడం లేదు. కానీ హరీష్‌శంకర్‌ రూపంలో బన్నీకి అలాంటి కథ దొరకడం ఆశ్చర్యకరమే. ఇక కామెడీని పండించడంలో వినాయక్‌ కంటే హరీష్‌శంకర్‌ సిద్దహస్తుడు. మరి ఈ చిత్రం ఎలాంటి కిక్‌ నివ్వనుందో వేచిచూడాల్సివుంది...! ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని, అందులో ఒక పాత్ర పోలీస్‌ఆఫీసర్‌గా, మరో పాత్ర నెగటివ్‌ షేడ్స్‌లో ఉండనుందని అలాగే మూడో పాత్ర చారి టైప్‌లో కామెడీ పంచనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ తన నట విశ్వరూపాన్ని చూపే అవకాశం ఉందని ఆయన అభిమానులు అంటున్నారు.

ఇక మంచువిష్ణు గతంలో చేసిన 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణ యువకుడి పాత్రను చేశాడు. ఈ చిత్రం బ్రాహ్మణుల నుంచి తీవ్ర వ్యతిరేకతను రుచిచూసి, మొత్తానికి సక్సెస్‌ అయింది. ఇలా ఈ చిత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కాగా ప్రస్తుతం హిట్స్‌లేని మంచువిష్ణు కూడా మరోసారి 'చారి' తరహా పాత్రను చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు హిట్‌నిచ్చే దర్శకుడైన జి.నాగేశ్వరర్‌రెడ్డి అండతో బ్రహ్మానందంను తోడుతెచ్చుకుని 'ఆచారి అమెరికా యాత్ర' అనే చిత్రాన్ని త్వరలో చేయనున్నాడు. కానీ వీటి ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తే ఫర్వాలేదు కానీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచి, దాని ద్వారా వల్గర్‌కామెడీ సృష్టించకపోతే అదే చాలు. ఇక చాలామంది ఈ ట్రెండ్‌కు ఎన్టీఆర్‌-వినాయక్‌లు శ్రీకారం చుట్టారని వాదిస్తున్నారు. కానీ అసలు ఈ ట్రెండ్‌ చాలా ఏళ్ల కిందట కమల్‌హాసన్‌ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన 'మైఖేల్‌ మదన కామరాజు' చిత్రంలో ఇలాంటి పాత్రనే చేసి, ఆనాడే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ