తాజాగా నాగార్జున హాథీరాంబావాజీగా నటించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' విడుదలైంది. నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో వచ్చిన 'శిరిడీ సాయి' కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అయిన నేపథ్యంలో ఈ చిత్రానికి మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో అందరూ ఆనందించారు. నాగ్ మరో ప్రయోగంలో విజయం సాధించాడని భావించారు. కానీ ఈ చిత్రానికి టాక్ బాగున్నా కూడా కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో లేవని నిరూపితమవుతోంది. ఓవర్‌సీస్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. 'శిరిడీసాయి'తో నష్టపోయిన నిర్మాత మహేష్‌రెడ్డికి ఈ చిత్రం ఆ నష్టాలను భర్తీ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఈ చిత్రం 'శిరిడీ సాయి' కంటే ఎక్కువ నష్టాలను చవిచూడటం ఖాయమంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. వాస్తవానికి ఈ చిత్రంలో నాగ్ తన నటవిశ్వరూపాన్నే చూపించాడు. రాఘవేంద్రరావు తనదైన టేకింగ్‌తో బాగా తీశాడు. అయితే ఈ చిత్రం ఎందుకు ఆడటం లేదనేది ఎవ్వరికీ అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీనికి ఫిబ్రవరి వంటి అన్‌సీజన్‌లో రిలీజ్ చేయడమే కారణమని డిస్ట్రిబ్యూటర్లు నాగ్‌ని తప్పుపడుతున్నారు. ఈ సినిమాను గానీ పండగల సీజన్‌లో గానీ, లేదా పరీక్షలు అయిపోయిన తర్వాత సమ్మర్‌లో గానీ విడుదల చేసివుంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదంటున్నారు. కానీ ఈమద్య అనేక చిత్రాలు ఫిబ్రవరిలో కూడా విడుదలై మంచి విజయాలను సాధించిన మాట నిజమే. 'మిర్చి' నుంచి ఈ హవా బాగానే మొదలైంది. తాజాగా నాగ్‌కు అటు ఇటుగా వచ్చిన నాని 'నేను లోకల్' చిత్రం కూడా మంచి కలెక్షన్లను, లాభాలను రుచిచూసింది. డివైడ్‌టాక్ ఉన్నా కూడా ఓవర్‌సీస్‌లో కూడా బాగా ఆడింది. మరి అలాంటప్పుడు కేవలం రిలీజ్ టైం బాగా లేనందువల్లే ఇలా జరిగింది? అనుకోవడం కూడా సరికాదు. ఇక వెంకీలాగా ముందు జాగ్రత్త పడి సమ్మర్‌కి వెళ్లిపోయి ఉంటే బాగుండేదని, లేదా 'సోగ్గాడే చిన్నినాయనా' తరహాలో డేర్ చేసి, సంక్రాంతికే వచ్చి ఉన్నా బాగుండేదని మాత్రం కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ చిత్రం నైజాం హక్కులను కొన్న దిల్‌రాజుకు ఈ చిత్రం దాదాపు 5కోట్లు నష్టం తేనుందని సమాచారం.