ప్రయోగాలంటే కేవలం నేల విడిచి సాము చేయడం కాదు. కొన్ని కొన్ని విభిన్నమైన చిత్రాలను, పాత్రలను చేసి నటులుగా నిరూపించుకోవడం. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారు ఎన్నో సాహసాలు చేశారు. బట్టతలతో కనిపించనని, తనకు లేడీస్‌లో ఉన్న ఫాలోయింగ్‌కి అది దెబ్బని భావించిన అక్కినేని చాలా వయసు వచ్చినప్పటికీ 'సీతారామయ్యగారి మనవరాలు' చిత్రంలో బట్టతలతో కనిపించడానికి ఒప్పుకోకుండా దర్శకుడు స్వర్గీయ క్రాంతికుమార్‌ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. కానీ చివరకు ఆ పాత్ర హుందాతనం, వయసు చెప్పి ఆయన ఏయన్నార్‌ని బట్టతలతో కనిపించేందుకు ఒప్పించాడు. ఆ చిత్రానికి అక్కినేని హుందాతనమైన పెద్దరికరమే హైలైట్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్స్ కూడా కొన్ని ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా నాగ్ చేసినన్ని ప్రయోగాలు టాలీవుడ్‌లో మరో హీరో చేయలేదంటే అతిశయోక్తికాదు. అన్నమయ్యగా కనిపించడం అంటే మాటలు కాదు.. ఇక 'ఊపిరి'లో కేవలం వీల్‌చైర్‌కే పరిమితమయ్యే పాత్రను చేసి ఔరా అనిపించాడు. ఇక ఇప్పుడిప్పుడే మన స్టార్స్, హీరోలు మారుతున్నారు.
త్వరలో మాస్‌మహారాజా రవితేజ 'రాజా దిగ్రేట్'లో అంధునిగా కనిపించనున్నాడు. ఇక మరో యంగ్ హీరో రాజ్‌తరుణ్ సైతం 'అంధగాడు' చిత్రంలో అంధునిగా నటిస్తున్నాడు. ఇక సుక్కు చిత్రంలో చరణ్ గ్రామీణ యువకుడిగానే కాకుండా చెవిటి పాత్రను కూడా చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి హీరో అంటే ఆరడుగుల ఆజానుభాహుడు, అందగాడు అయి ఉండాలనే అపోహలు ఇప్పుడిప్పుడు మనవారికి తొలగుతున్నాయి. కథలో హీరో వికలాంగుడు అయినంత మాత్రాన చిత్రమంతా ట్రాజెడీగా, ఆ హీరో పడే వేదన, ఆవేదనలతో ఎడుపుగొట్టుగా ఉండాల్సిన పనిలేదు. ఇటీవల మలయాళంలో 'ఒప్పం'గా వచ్చి తెలుగులో 'కనుపాప'గా డబ్ అయిన చిత్రంలో హీరో పాత్ర పోషించిన మోహన్‌లాల్‌ది అంధుని పాత్రే అయినా చిత్రం ఆద్యంతం క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రయోగాలకు మన హీరోలు కూడా ఓకే చెబుతున్నారు.