ప్రస్తుతం తెలుగు హీరోలు కూడా ఇతర ఇండస్ట్రీలపై కన్నేస్తున్నారు. తమ మార్కెట్‌ను పెంచుకోవాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే మహేష్‌బాబు మురుగదాస్‌తో ఓ ద్విభాషాచిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో ఆయన తమిళంలోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ తన డబ్బింగ్ చిత్రాల ద్వారా ఇప్పటికే మాలీవుడ్‌లో పాగా వేశాడు. ప్రస్తుతం ఆయన కన్ను కూడా కోలీవుడ్‌పై పడింది. దీంతో ఆయన త్వరలో తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు.
ఇక తన సోదరుడు అల్లు అర్జున్‌కు మలయాళంలో ఉన్న ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని, నాన్నకున్న పరిచయాలతో అల్లు శిరీష్ సైతం మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న '1971' చిత్రంలో ఓ పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే రానా వంటి యంగ్ హీరోలు కూడా అనేక భాషల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రభాస్ 'బాహుబలి'తో తనకు వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకొని తన తర్వాతి ప్రాజెక్ట్‌లను మల్టీలాంగ్వేజ్ చిత్రాలుగా రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక వీరి సరసన నాగచైతన్య కూడా చేరిపోవడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆయన్ను తమిళంలోకి పరిచయం చేస్తానని స్వయాన గౌతమ్‌మీనన్ హామీ ఇచ్చాడు.
కానీ చైతూ మాత్రం ఇంకాస్త తొందరపడుతున్నాడు. గౌతమ్ మీనన్ చిత్రంలోపే తమిళంలో కాలు మోపడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ఆయన త్వరలో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే తమిళంలో '16'చిత్రాన్ని తీసిన యువదర్శకుడు కార్తీక్ నరేన్ ఓ హర్రర్ థ్రిల్లర్ మూవీని తీయనున్నాడు. ఇందులో రెండు కీలకమైన పాత్రలుంటాయని తెలుస్తోంది. అందులో ఒక పాత్రను నాగచైతన్య చేయనున్నాడని, మరో పాత్రను అరవింద్ స్వామి చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులో కూడా రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవలే రానా కూడా కార్తీక్ నరేన్‌ను పిలిచి మరీ మెచ్చుకోవడం జరిగింది. దీంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను రానా దగ్గుబాటి నిర్మించే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.