అమ్మ జయలలిత తో సినిమా చేసేస్తానని తమిళ దర్శకులు చాలామందే క్యూ కట్టారు. అయితే ట్విట్టర్ రారాజు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం చిన్నమ్మ మీద సినిమా తీస్తానని చెప్పి ఒక అడుగు ముందుకువేశాడు. అసలు జయలలిత మరణం తర్వాతే శశికళ జీవిత కథతో సినిమా ఉంటుందని ప్రకటించాడు వర్మ. అయితే అది అప్పటినుండి పట్టాలెక్కలేదు. కానీ ఈ లోపు శశికళ సీఎం అవుదామని రాజకీయ చందరంగపు అట మొదలుపెట్టింది. కానీ శశి ఆశలపై నీళ్లు చిమ్మింది సుప్రీం కోర్టు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆమె కనుసన్నల్లోనే ప్రభుత్వం నడిచేలా శశికళ తన అభ్యర్థి పళని స్వామిని సీఎం అభ్యర్థిగా నియమించి సక్సెస్ అయ్యింది. తన శిక్షాకాలాన్ని పూర్తి చెయ్యడానికి శశికళ జైలుకెళ్లింది. మరి ఈ విషయాలన్నీ వర్మ గనక సినిమాలో చూపిస్తే అది 100 పెర్సెంట్ సక్సెస్ సాధిస్తుంది. అంతలా శశికళ జీవితం వుంది. ఇక శశికళ, జయలలిత కు పరిచయమైనప్పటి నుండి జైలుకెళ్లేవరకు సినిమాగా తీస్తే ఆ సినిమా మాత్రం మూడు నాలుగు పార్టులుగా అవుతుందనేది జగమెరిగిన సత్యం.
ఇక శశికళ గురించి ఎవరికీ తెలియని విషయాలు తనకు తెలుసనీ... ఆ విషయాలను సినిమాలో చూపిస్తానని వర్మ చెబుతున్నాడు. జయకు, శశికి ఉన్న అనుబంధమేమిటి... రాజకీయాల్లో జయకు శశి ఎలాంటి సలహాలిచ్చింది... రాజకీయాలపై శశికళకు ఉన్న పట్టేమిటి అలాంటి అంశాలన్నీ వర్మ తన సినిమాలో చూపిస్తానని చెబుతున్నాడు. ఇక ఆ సినిమా టైటిల్ కూడా 'శశికళ' అని రిజిస్టర్ చేయించాడని అంటున్నారు. ఇక శశికళ పై సినిమ గురించి వర్మ గత రాత్రి నుండి ట్వీట్స్ స్టార్ట్ చేసాడు. ఆ ట్వీట్స్ లో శశికళ పోయెస్ గార్డెల్ లో ఎలా ఉండేదో, మన్నార్ గుడి మాఫియా అంటే ఏమిటో అనేవి అన్ని వివరించాడు.
ఇక శశికళ జైలు నుండే తమిళనాడుని శాసిస్తుందని ఆమె కనుసన్నల్లోనే తమిళనాడు ప్రభుత్వం నడుస్తుందని అబ్బో ఒకటేమిటి చాలానే ట్వీట్ చేసాడు. మరి వర్మ చెప్పినవన్నీ సినిమాలో చూపిస్తాడా లేదా అనేది కొన్నాళ్ళు వేచిచూడక తప్పేలా లేదు.