రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా ఆ స్థానాన్ని చేరుకుంటాడని అల్లరి నరేష్‌ను అందరూ భావించారు. అలాగే కొంతకాలం వరకు ఆయన హవా నడిచింది. ఫ్లాప్ కావాల్సిస చిత్రాలు కూడా అల్లరోడి పుణ్యమా అని యావరేజ్‌లుగా నిలిచి నిర్మాతలకు కొండంత బలానిచ్చాయి. కానీ రాను రాను అవే పేరడీ చిత్రాలు, మూస కామెడీ చిత్రాలు చేయడంతో ఆయన వరస పరాజయాల బాట పట్టాడు. ఆడుతాయనుకున్న చిత్రాలు, యావరేజ్‌గా నిలుస్తాయనుకున్నవి కూడా పరాజయం పాలవ్వడం మొదలుపెట్టాయి.
ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న 'సెల్ఫీరాజా, ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో అల్లరోడి కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. 'ఇంట్లో దెయ్యం...' చిత్రం సెట్స్‌పై ఉండగానే 'అలా ఎలా' ఫేమ్ అనీష్ దర్శకత్వంలో అల్లరోడు ఓ చిత్రం ప్రకటించాడు. అలాగే భీమనేని శ్రీనివాసరరావు దర్శకత్వంలో మరో చిత్రం ఉంటుందన్నాడు. అనీష్ చిత్రానికైతే 'మేడ మీద అబ్బాయి' అనే టైటిల్‌ను కూడా రిజిష్టర్ చేయించారు. కానీ ఈ చిత్రం అదిగో ఇదిగో అంటూ సాగిపోతునే ఉంది.
ఆరునెలలైనా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇక ఈ చిత్రం అట్టకెక్కినట్లేనని ప్రచారం మొదలైంది. దర్శకుడు అనీష్‌కృష్ణ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాతగా రాజ్‌తరుణ్ హీరోగా ఓచిత్రం చేయడానికి రెడీ అయిపోయాడు. దాంతో అల్లరోడు సినిమా ఆగిపోయినట్లేనని తేలిపోయింది. దీంతో తనకు 'సుడిగాడు' వంటి హిట్ ఇచ్చిన భీమనేని సినిమా ముందుకొచ్చింది. ఈ చిత్రం కోసం భీమనేని ఓ ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఓ సబ్జెక్ట్‌ను సిద్దం చేశాడట. ఇక ఈ చిత్రం భీమనేనికి, అల్లరోడికి కూడా కీలకంగా మారనుంది.