ఎన్నో ఏళ్లుగా తెలుగులో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న బ్రహ్మి... ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు మూడు చిత్రాలు.. అదీ శ్రీనువైట్ల తరహా బకరా వేషాలలో పేరు తెచ్చుకున్నాడే గానీ యువ కమెడియన్ల రాకతో ఆయన హవా బాగా తగ్గుతోంది. ఇక హిట్టయిన చిత్రాలలో కూడా ఆయన నవ్వించలేకపోతున్నాడు. రొటీన్ హావభావాలు, క్యారెక్టర్లు అందరినీ విసిగిస్తున్నాయి. చిరు 'ఖైదీ'తో పాటు కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ ఆయన వెలవెలబోయాడు. దీంతో ఆయన కెరీర్ ఇప్పుడు చరమాంకంలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క మంచు విష్ణు కూడా ఒక్క హిట్టు లేక ఇబ్బందిపడుతున్నాడు. 'ఢీ, దేనికైనారెడీ' వంటి చిత్రాలలో ఆయన బ్రహ్మీని అడ్డుపెట్టుకొని లాక్కొచ్చాడు.
ఆ తర్వాత వర్మతో చిత్రాలు, దాసరితో 'ఎర్రబస్సు'తో పాటు ఇటీవల 'లక్కున్నోడు' ద్వారా కనీసం ఓపెనింగ్స్‌ను కూడా తెచ్చుకోలేకపోతున్నాడు. దీంతో వీరిద్దరూ మరోసారి నాగేశ్వర్‌రెడ్డినే నమ్ముకుని ఓ చిత్రం చేయనున్నారట. గతంలో దాసరి 'ఆచారి అమెరికా యాత్ర' అనే కామెడీ నవల రాశాడు. మరి ఇదే నవలను తెరకెక్కిస్తున్నారో? లేక ఈ టైటిల్‌ను మాత్రమే వాడుకొంటున్నారో తెలియదు గానీ ఇదే టైటిల్‌తో మంచువిష్ణు, బ్రహ్మానందంలు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మీ పాత్ర 'అదుర్స్'లోని చారి పాత్రకు కొనసాగింపులా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ చిత్రం మంచు విష్ణుకు, బ్రహ్మానందంలకు చాలా కీలకమని వేరే చెప్పాల్సిన పనిలేదు.