దేశ రాజ్యాంగం ఏమీ బ్రహ్మపదార్ధమో లేక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ల వంటి మార్చడానికి వీలులేని, తాకడానికి కూడా అర్హతలేని పుస్తకం ఏమీ కాదు. ఇప్పటికే మన రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారం, స్వార్ధం కోసం ఎన్నో సవరణలు, చట్టాలు చేశారు. మరి ఇప్పటికీ పార్లమెంటరీ వ్యవస్థ పేరుతో మన దేశంలో ప్రజాస్వామ్యం అష్టవంకర్లు పోతోంది. వాస్తవానికి దేశ రాజ్యాంగంలో ముందుగా చేయాల్సిన, అత్యవసర సవరణ ఒకటి ఉంది. దేశ ప్రధానులను, రాష్ట్ర ముఖ్యమంత్రులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం కావాలి. మోదీని ప్రధానిని చేయాలని దేశ ప్రజలు భావించారు. కానీ ఎందరిలోనే ఒకటే దిగులు. కావాల్సినంత మంది ఎంపీలు బిజెపి దక్కించుకోకపోతే మరెవ్వరైనా ప్రధాని అయిపోతారేమోనని మదన పడిన వారు ఎందరో ఉన్నారు.
అదృష్టవశాత్తు మోదీనే ప్రధాని కాగలిగారు. అదే ఏ మాత్రం తేడా వచ్చి ఉంటే ఈ కుళ్లు రాజకీయాలు, అనైతిక పొత్తుల నేపథ్యంలో మోదీ ప్రధాని కాలేకపోయి ఉంటే దేశ ప్రజల మనసు ఎంతగా క్షోభించేదో ఎవరికైనా తెలుసా? కాబట్టి ఇకనైనా కనీసం మన ప్రధానులను, ముఖ్యమంత్రులను నేరుగా ఎన్నుకునే వ్యవస్థ మనకి కావాలి. ఇక రెండోది ఏమిటంటే.. దేశంలోని సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి. దీనికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉండటం అభినందనీయం. ఇటీవల మన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా అదే విషయాన్ని వెల్లడించారు. కానీ దీనికి బిజెపి చెబుతున్న కారణాలు నిజం కాదు.
ప్రతిసారి ఎన్నికల వల్ల దేశరక్షణలో ఉండే సైన్యాన్ని, ఇతర పోలీసులు, ఎన్నికల నిర్వహణ అధికారులను నియమించడానికి, ఎన్నికలకు ఎక్కువ ఖర్చు, శ్రమ అవుతోందని బిజెపి అంటోంది. అందులో కేవలం సగం మాత్రమే నిజం ఉంది. అసలైన నిజం ఏమిటంటే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకుంటారు. కానీ వారు అదికారంలో ఉండే ఐదేళ్లలోనే ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలంటూ, ఆ ఎన్నికలంటూ, ఈ ఎన్నికలంటూ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోలేక, ఐదేళ్లలో తామనుకున్న మంచి పనులను చేయలేకపోతున్నాయి. ఉదాహరణకు యూపీతో సహా ప్రస్తుతం ఎన్నికలు జరిగిన, జరుగుతున్న మినీ ఎన్నికల సమరం వల్ల కేంద్రం కూడా ఎక్కువగా ప్రజాకర్షక పథకాలకు, ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రజలను మచ్చిక చేసుకొని గెలవడం కోసం ఓటు బ్యాంకు రాజకీయలకు పాల్పడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి దేశ పార్లమెంట్ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి జరిపించేలా మన ఎంపీలు సవరణ చేయాలి.కానీ వీటిని కూడా రాజకీయం చేసే ప్రతిపక్షాలు బిజెపికి ఈ చట్టంతేవాలని ఉన్నా కూడా వారికి మద్దతునిస్తాయా? లేదా? అనేది అసలైన ఆందోళనగా చెప్పాలి.