ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాలలో మనమే గొప్ప అని డప్పు వాయించుకుంటూ మన జబ్బలను మనమే చరుచుకుంటూ ఆత్మస్తుతి చేసుకుంటున్నాం. కానీ మనదేశంలో ప్రజాస్వామ్యం అంటే నేతి బీరకాయలోని నేయి చందంగా తయారైన విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. తాజాగా తమిళనాడు రాజకీయాలను చూస్తే జుగుప్స వేయకమానదు. తమిళ ప్రజలు కేవలం జయలలితను ముఖ్యమంత్రిని చేసేందుకే ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను ఎక్కువగా గెలిపించిన మాట వాస్తవం.
కానీ ఆమె మరణానంతరం ఏమి జరుగుతోంది? ఆమె పేరుతో ఎన్నో అక్రమాలకు పాల్పడిన ఆమె నెచ్చెలి శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని భావించింది. మరోవైపు జయ నమ్మిన బంటు వంటి పన్నీర్‌సెల్వం కేంద్రం లోపాయికారీ మద్దతుతో పీఠం అధిరోహించాలని ప్రయత్నాలు చేశాడు. చివరకు శశికళకు సుప్రీం అడ్డుకట్టవేయడమే మన గొప్ప ప్రజాస్వామ్యానికి చిన్న నిదర్శనం. కానీ శశికళ జైలుకు వెళ్తూ కూడా ఆ పార్టీని తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి, తన కనుసైగలలో పార్టీని నడిపించడానికి ప్రణాళికలు వేసి సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. ఇంకా ఏడాది కూడా కాకముందే డీఎంకే ఇదే అదనుగా మద్యంతర ఎన్నికలకు సిద్దం అంటోంది.
గవర్నర్ ప్రతి దానిని నాన్చుతున్నాడు. పన్నీర్ వర్గం ఎలాగైనా బలం పుంజుకోవాలని చూస్తోంది. వాస్తవానికి చిన్నమ్మను ముఖ్యమంత్రిగా చూడటానికో, సాష్టాంగ ప్రణామాలు చేసే బలహీనుడైన పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రిని చేయాలనో తమిళనాడు ప్రజలు ఆశపడటం లేదు. కానీ జయ పేరు చెప్పుకొని గెలిచిన ఎమ్మెల్యేలు తమకు ఎవరు ఎక్కువ అవినీతికి అవకాశం ఇస్తే వారిని, తమకు మంచి ప్యాకేజీలు ఇచ్చేవారిని ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేయాలని భావిస్తున్నారు. మరీ ఇంత దౌర్భాగ్యమా? అదే జయ బతికి ఉంటే ఆదాయానికి మించిన ఆస్తుల్లో 'ఏ-1' అయిన ఆమె కూడా ఇప్పుడు జైలుకే వెళ్లేవారు. కానీ ఆమె పేరు చెప్పుకొని, ఆమె ఆత్మ సాక్షితో మాట్లాడుతూ, ఆమె సమాధి వద్ద దీక్ష చేసేవారు. శపధాలు చేసేవారు... ఎంతకాలం ఈ దౌర్భాగ్యం.. వ్యక్తిగత పూజకు ఇదో పరాకాష్ట.
ఇక కేవలం 100కోట్లు కూడా లేని అక్రమ సంపాదన కేసుల్లో జయ, శశికళల పరిస్థితి ఇలా ఉంటే ఇక లక్షల కోట్లు సంపాదించిన వారి సంగతి ఏమిటి? ఎవరో లక్ష కోట్లు సంపాదించారు కాబట్టి తాము కూడా సంపాదిస్తే తప్పేముందని ఆలోచిస్తున్న మిగిలిన వారి సంగతేమిటి? నేటి పార్లమెంట్ సభ్యులలో, ఇతర రాష్ట్రాలోని ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి కార్పొరేటర్ల వరకు దాదాపు 75శాతానికి పైగానే అక్రమార్కులున్నారు. మరి మనం ఎవరిని ఎన్నుకోవాలి? దేశంలో ఇప్పటికీ ఎంతో కొంత నిజాయితీతో పనిచేస్తున్నది కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే అనిపిస్తోంది. ఇక్కడ కూడా చీడపురుగులు ఎందరో ఉన్నారు. కానీ అన్ని ఇజాలు పెడదోవలు పోతున్నాయి. కమ్యూనిజం, నక్సలిజం నుంచి జర్నలిజం వరకు ఎందులోనూ నిజాయితీ లేదు. అన్ని పేరుకు ఉన్నతభావాలే.. కానీ ఆచరించే వ్యక్తులలో చిత్తశుద్ది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఎటువైపు పయనిస్తుందో అర్ధం కావడం లేదు.