నేడు భారతదేశం సగర్వంగా తలెత్తుకుంటోందంటే కేవలం అంతరిక్ష రరగంలో మనం సాధిస్తున్న విజయాలు.. ఎవరి అండదండలు లేకుండా మన సత్తా చాటుతున్న శాస్త్రవేత్తల పుణ్యమే. నాటి విక్రమ్ సారాభాయ్ నుండి నిన్నటి అబ్దుల్‌కలాం వరకు ఈ రంగానికి ఎందరో మహోన్నత సేవలు అందించారు. తాజాగా పీఎస్‌ఎల్వీసీ సీ-37 ప్రయోగంలో ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి మన శాస్త్రవేత్తలు దేశం గర్వపడేలా, ప్రతి భారతీయుడు తలెత్తుకునేలా చేశారు.
ఈ విషయంలో మనం ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా నిలిచార. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఇతర రంగాల్లో మనం సాధించిన ప్రగతి ఏదైనా ఉందా? అంటే శూన్యమనే చెప్పాలి. కీలకమైన రక్షణరంగంలో వాడే యుద్దట్యాంకర్లు నుండి హెలికాప్టర్ల వరకు.. కిష్టపరిస్థితుల్లో, చలి, ఇతర వాతావరణ పరిస్థితుల్లో మన సైనికులు వాడే దుస్తుల నుంచి వీరమరణం పొందిన జవాన్ల పార్ధివదేహాలను పెట్టే శవపేటికల వరకు మనం ఇతర దేశాల మీదనే ఆధారపడుతున్నాం. ఒక క్రికెట్‌లో తప్ప ఏ ఇతర క్రీడల్లో, మరీ ముఖ్యంగా మన దేశ క్రీడ అయిన హాకీ నుంచి ఫుట్‌బాల్ వరకు, ఏసియన్ గేమ్స్ నుంచి ఒలింపిక్స్ వరకు మనం దేంట్లో అగ్రగణ్యులం? కీలకమైన వ్యవసాయ పరిశోధనల్లో కూడా మనం వెనుకబడే ఉన్నాం. చివరకు చీడపీడలను ఎదుర్కొనే కొత్త వంగడాలు, క్రిమిసంహారక మందులు, రైతులకు అత్యంత ముఖ్యమైన ట్రాక్టర్లను కూడా మనం స్వయంగా తయారు చేయలేకపోతున్నాం.
ప్రపంచానికి నాగరికత తెలియని రోజుల్లోనే మనం కొత్త కొత్త కట్టడాలను, దుర్భేద్యమైన కోటలను, అద్భుతమైన డ్రేనేజీ వ్యవస్థలను పొంది ఉన్నామని చరిత్ర చెబుతున్నా, నేటికి మన నాయకులు అమరావతి నిర్మాణానికి కూడా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ వంటి వాటిపై ఆదారపడుతున్నామంటే ఈ దుస్థితిని ఏమనాలి? మన దేశంలో మేథావులకు, శాస్త్రవేత్తలకు, కొత్త వాటిని కనుకొగే ప్రయత్నాలు చేసేందుకే కాదు.. మానవ వనరులు ఎన్నో ఉన్నా కూడా మనల్ని ప్రోత్సహించే వారే లేరు. ప్రపంచయుద్దంలో ఎంతో నష్టపోయిన జపాన్‌తో పాటు మన తర్వాత స్వాతంత్య్రం పొందిన దేశాలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయి. నీటివనరులు లేని ఇజ్రాయిల్ సైతం బిందు సేద్యంతో, సముద్రపు ఉప్పునీటిని సాగునీరుగా మార్చేందుకు ప్రయత్నాలు చేసి విజయం సాధించింది. కానీ మనం మాత్రం ఇంకా ఉన్న నీటిని కూడా సముద్రం పాలు చేసి, కరువు, కాటకాలతో అల్లాడుతున్నాం.. కేవలం పెట్రోల్ తప్ప మరేమీ వనరులు లేని దేశాలు నేడు ప్రపంచాలను శాసిస్తున్నాయి. అన్ని వనరులు ఉన్నా కూడా మనం ఎందుకు వెనుకబడి ఉన్నామో ఇప్పటికైనా నిజాయితీగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.