ఈమధ్య తరచుగా పవన్ సోదరుడు మెగాబ్రదర్ నాగబాబు పవన్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మరి దీని అంతరార్ధంపై అనేక మందిలో అనేక అనుమానాలున్నాయి. అయినా పవన్ అనే వ్యక్తి సినిమా హీరోగానే కాదు.. తన వ్యక్తిత్వంతో కూడా ఎందరో అభిమానులను ఏర్పరచుకున్నాడనేది వాస్తవం. కానీ ఈరోజు నాగబాబు చెబితేనే పవన్ గురించి ఆయన అభిమానులకు వాస్తవాలు తెలుస్తాయని అనుకోవడం భ్రమ మాత్రమే. పవన్ వ్యక్తిత్వం తెలిసిన వారే ఆయనను సినిమాలకు అతీతంగా ఆరాధిస్తున్నారనేది వాస్తవం. ఇక నాగబాబు 'పవన్ మీద నా దృష్టికోణం' అనే పేరుతో పలు విషయాలు చెప్పుకొచ్చారు. పవన్ చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. బయట తిరగడం, అల్లరి వంటివి చేసేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ, ఏదో చేయాలని, ఏదో కావాలని తెగ ఆలోచిస్తూ ఉండేవాడు.
వాడికి అందరిపై ప్రేమ ఉంటుంది కానీ దానిని ఎలా బయటకు చెప్పాలో వాడికి తెలియదు. నేను, అన్నయ్య చిరు మాత్రం బయటకు చెప్పేరకం. కానీ వాడు ఆ ప్రేమను తన మనసులోనే దాచుకొని, చేతల్లో చూపించాలనుకునే రకం. మేము ఎంఏ, ఎల్‌ఎల్‌బి వంటి చదువులు చదివాం. కానీ పవన్ పెద్దగా చదువుకోలేదు. కానీ వాడికి దేశ, విదేశీ పరిస్థితులపై ఎంతో అవగాహన ఉంది. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. వాడు ఎన్ని పుస్తకాలు చదివాడో చెప్పలేం. వాడికి నటునిగా కంటే దర్శకునిగా మారాలనే కోరిక ఉండేది. తాననుకున్న భావాలను అలా చూపించవచ్చని అనుకునేవాడు. కానీ మా అందరి మాట విని నటునిగా మారడానికి ఒప్పుకున్నాడు.
ఇక పవన్‌కి నా సహాయం అవసరం లేదు. హి హిమ్ సెల్ఫ్ ఏ పవర్. కానీ అన్నయ్యకు మాత్రం నా అవసరం ఉంది. ఇక పీఆర్‌పీ పార్టీని విలీనం చేయడం వాడికి ఇష్టంలేదు. దాంతో మౌనంగా, మాకు దూరంగా ఉండిపోయాడు. ఇక నేను అన్నయ్య వైపు ఉన్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయమే కానీ రాజకీయ నిర్ణయం కాదు. ఇక చాలామంది పవన్ ఫ్యాన్స్‌కు ఆయనంటే అభిమానం ఏర్పడింది. ఆయన వ్యక్తిత్వం చూసి ఆయనకు కొందరు మద్దతునిచ్చారు. దాంతో మెగాఫ్యాన్స్ చీలిపోయారనే వాదన వచ్చింది. ఎవరికి వారికి ఇండివిడ్యువల్‌గా ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉండటం మంచిదే. కానీ అందరి హీరోలలాగనే పవన్ ఫ్యాన్స్‌లో కూడా కొందరు చెడ్డవారున్నారు. మేము పవన్‌కు అన్యాయం చేశామనేది వారి ఉద్దేశ్యం కావచ్చు. దాంతో అతను అటెండ్ కానీ ఫంక్షన్లలో కూడా ఆయన పేరుతో అరుపులు, గోల చేసేవారు.
దాంతోనే నేను అలాంటివారిపై ఆగ్రహించాను. తన పెళ్లిళ్ల విషయంలో, వ్యక్తిగత విషయంలో వాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఎప్పుడు ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. తనకు తినడానికి లేకపోయినా ఎదుటివారికి పెట్టే నైజం వాడిది. కంఠం తెగిపడినా భయపడడు. తాననుకున్నది సాధించే దాకా ప్రయత్నించే మొండివాడు. కిందటి ఎన్నికల్లో పవన్ వల్ల టిడిపి, బిజెపిలు లాభపడ్డాయనేది వాస్తవం. టిడిపి చాలా చోట్ల కొద్దిపాటి ఓట్ల తేడాతో గెలిచింది. ఈ విషయంలో పవన్ వారికి బాగా ఉపయోగపడ్డాడు. అలాంటి పవన్ వంటి నాయకుడు రాష్ట్రంలో ప్రజల కోసం పార్టీ పెట్టాడం శుభపరిణామమే.. అంటూ పలు విషయాలు నాగబాబు చెప్పుకొచ్చారు.