1971లో ఇండో పాక్ యుద్దంలో పాకిస్థాన్ సబ్‌మెరైన్ 'ఘాజీ'ని నాశనం చేసిన మన దేశ నావికాదళ సైన్యం చూపిన పరాక్రమాన్ని చూపుతూ, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 'ఘాజీ'. కాగా ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియర్‌షోలను దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ ప్రీమియర్‌ను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రం చూసిన దర్శకులు, నటీనటులు, ఇతరులు నూతన దర్శకుడు సంకల్ప్‌రెడ్డి టాలెంట్‌ను, రానా తెగింపును చూసి ముచ్చటపడుతూ ప్రశంసలు కురపిస్తున్నారు.
హీరోలు నాగచైతన్య, సుమంత్, నిఖిల్, హీరోయిన్లు రకుల్‌ప్రీత్‌సింగ్, లావణ్యత్రిపాఠి, దర్శకులు క్రిష్, మారుతి వంటి వారు ఈ ప్రయత్నాన్ని చూసి అద్భుతమని కొనియాడుతున్నారు. ఇక స్వర్గీయ రామానాయుడు మనవళ్లైన రానా దగ్గుబాటి, నాగచైతన్య అక్కినేనిలు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా సన్నిహితంగా, స్నేహంగా కనిపిస్తుంటారు. కాగా ఈ చిత్రం చూసిన నాగచైతన్య 'ఘాజీ'నిగురించి, హీరో రానా గురించి ట్వీట్ చేశాడు. ఇంత గొప్ప చిత్రాన్ని తీసిన చిత్ర బృందానికి కంగ్రాట్స్... వీరు తెలుగు సినిమా స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. రానా.. నువ్వు ఇలాంటి గొప్ప చిత్రాలు, పాత్రలు ఎన్నో చేయాలని నాగచైతన్య ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రాన్ని వీక్షించిన విమర్శకులు దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.