దేశంలో రోజు రోజుకూ ఆల్కహాల్, పొగాకు వినియోగం పెరిగిపోతున్నాయి. దీనిపట్ల ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం వల్ల, పొగాకును సిగరెట్లు, బిడీలు, చుట్ట, గుట్కాలతో పాటు పలు రకాలుగా వాడుతున్నారు. పొగాకు పెంచే రైతులకు కూడా ప్రభుత్వాలు బాగానే సహాయం చేస్తున్నాయి. దీంతో వీటి వినియోగం మరింతగా పెరిగిపోతోంది. ప్రస్తుతం గ్లోబలైజేషన్‌తో పాటు పలు కారణాల వల్ల చైనా వంటి దేశాల్లో తయారైన సిగరెట్ల వినియోగం కూడా పెరిగిపోతోంది.
ఇండియాలో దాదాపు 15రూపాయలకు అమ్మే గోల్డ్‌కింగ్ సిగెరెట్‌ల వంటివి చైనా నుండి దిగుమతై కేవలం రూపాయి, రెండు రూపాయలకే లభిస్తున్నాయి. ఇక మద్యం వల్ల రోడ్డు ప్రమాదాలతో పాటు పలు శాడిస్ట్ మెంటాలిటీలు పెరిగిపోతున్నాయి. పొగాకు వాడకం వల్ల నోటి క్యాన్సర్ రోగులు ఇచ్ఛాడిముబ్బడిగా పెరిగిపోతున్నారు. ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో అలసత్వం వహిస్తున్నాయి. పొగాకుకు, మద్యానికి వ్యతిరేకంగా కోట్లాది రూపాయలను ప్రభుత్వాలు ప్రకటనల కోసం ఖర్చుచేస్తున్నాయి. ప్రతి బడ్జెట్‌లోనూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మొదటగా రేట్లు పెంచేది పొగాకు విక్రయాలపైనే. ఇక మద్యం రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. మద్యం మాఫియాలు ఏర్పడి, సిండికేట్‌లుగా మారి, మద్యాన్ని అసలు ధర కంటే ఎక్కువ ధర వసూలూ చేస్తున్నారు. అయినా కూడా ఈ దురలవాట్లు ఉన్న వారు ధర పెరిగినా కూడా వాటిని మానలేరు సరికదా...! మరింతగా జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
ఇక ప్రభుత్వాలు మాత్రం గొప్పగా తాము మద్యం, పొగాకు విక్రయాలను ప్రత్యేక ఆదాయ వనరుగా చూడటం లేదని, వాటి వినియోగం తగ్గించడానికే రేట్లు పెంచుతున్నామని చెబుతున్న మాటలన్నీ బూటకం. మద్యాన్ని బహిరంగంగా తాగరాదు. సిగరెట్లను పది మందిలో కాల్చరాదు... ఇలా చేసిన వారికి జరిమానా వేసి శిక్షిస్తున్నాం.. అని చెబుతున్నారే గానీ వాటిని పూర్తిగా నిషేధించడంలో ఎందుకు వెనుకాడుతున్నారనే ఆవేదన కలగకమానదు. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేదం చేశాడు. ఇప్పటికే పలు ఉద్యమాల వల్ల సారాయిపై నిషేధం ఉంది. వీటిని నిషేధించినంత మాత్రాన వీటి వినియోగం పూర్తిగా తగ్గుతుందని చెప్పలేం కానీ ఎంతో కొంత వినియోగం మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్యం నిషేధాన్ని బాగా అమలు చేయగలుగుతున్నాయి. కానీ నిషేధం వల్ల సమస్య పరిష్కారం కాదని కొందరు సెలవిస్తూ, అంచెలంచెలుగా మద్యంపై నిషేధాన్ని ఎత్తివేసి, అతి తక్కువ ధరకే చీప్‌లిక్కర్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలకు, నాయకులకు చిత్తశుద్ది లేకపోవడమే అసలు సమస్య.