హిట్ సినిమాలు .. ఫ్లాప్ సినిమాలు ఉంటాయి. కానీ వీటికి ఆయా చిత్రాల కమర్షియల్ సక్సెస్‌లను, ఎంత కలెక్ట్ చేసింది అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మంచి కలెక్షన్లు వసూలు చేసిన దానిని హిట్ సినిమా అని, బాగా వసూలుచేయని సినిమాను ఫ్లాప్ సినిమా అంటారు. కానీ హిట్ సినిమాలు వేరు... మంచి సినిమాలు వేరు. హిట్ సినిమాలన్నీ మంచి సినిమాలు కాలేవు. అలాగే తక్కువ వసూలు చేసి ఫ్లాప్ అనిపించుకున్న చిత్రాలలో కూడా మంచి చిత్రాలు ఉంటాయి.
కానీ వీటి మద్య ఉండే పల్చనిపొర వంటి తేడాను అటు ప్రేక్షకులు, అభిమానులు, సినిమా వారు కూడా మర్చిపోతున్నారు. తమ చిత్రం ఇంత కలెక్ట్ చేసింది కాబట్టి అది హిట్ సినిమా అని వాదిస్తుంటారు. 100కోట్లు వసూలు చేసిన చిత్రాలన్నీ మంచి చిత్రాలు అయితే ఎలా? దీనికి ఒకప్పుడు మలయాళంలో విడుదలైన కొన్ని చిత్రాలనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆనాడు సెక్స్‌బాంబ్ షకీలా నటించిన బూతు చిత్రాలు అతి తక్కువ పెట్టుబడితో నిర్మితమై కోట్లాది రూపాయలను వసూలు చేశాయి. చివరకు ఆమె చిత్రాలకు పోటీగా మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు నటించిన విభిన్న చిత్రాలను కూడా విడుదల చేయడానికి భయపడే వారు.
రిలీజ్‌లను వాయిదా వేసేవారు. అలాగని షకీలా చిత్రాలు మంచి చిత్రాలై పోతాయా? మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి వారు చేసిన విభిన్న చిత్రాలు చెత్త చిత్రాలైపోతాయా? 'ఖైదీనెంబర్150' చిత్రం ఎంత కలెక్ట్ చేసినా అది హిట్ చిత్రమే గానీ మంచి చిత్రం కాలేదు. 'గౌతమీపుత్ర' చిత్రం తక్కువ వసూలు చేసినా కూడా అది చెత్త చిత్రం కాదు. కాబట్టి మా చిత్రం ఇంత కలెక్ట్ చేసింది కాబట్టి మాది మంచి చిత్రమనే వాదించే వారిని మనం ఏమీ చేయలేం. చివరకు దాసరి, పోసాని వంటి వారు కూడా తమ చిత్రాలు ఎంత కలెక్ట్ చేశాయనే దాని మీద, నిర్మాతలకు ఎంత లాభాలను మిగిల్చాయనే దాని మీదనే మంచి, చెడ్డ చిత్రాలు ఆధారపడి ఉంటాయని వింత వాదనలు వినిపిస్తున్నారు. ఈ ధోరణి ఇకనైనా మారాలి....!