సంక్రాంతికి విడుదలైన చిరు 'ఖైదీ నెంబర్150', బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి', శర్వానంద్-దిల్‌రాజుల 'శతమానం భవతి' చిత్రాలు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఓవర్‌సీస్‌లో కూడా మంచి కలెక్షన్లు సాధించాయి. ఇటీవల విడుదలైన నాని 'నేను..లోకల్' చిత్రానికి కూడా యూఎస్‌లో మంచి కలెక్షన్లే వచ్చాయి. దాంతో సూర్య-హరిల కాంబినేషన్‌లో వచ్చిన 'సింగం3', నాగార్జున-రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో ఆ పక్కరోజే వచ్చిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలు కూడా యూఎస్‌ల కలెక్షన్ల పంటను, డాలర్ల వర్షాన్ని కురిపిస్తాయని చాలా మందితో పాటు ఆ చిత్రాల ఓవర్‌సీస్ రైట్స్‌ను కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సూర్య నటించిన 'సింగం3' చిత్రం పక్కా మాస్ చిత్రం కావడంతో దానికి మన రాష్ట్రాలలోనే 'ఎ' సెంటర్ ప్రేక్షకులు కూడా చూడటం లేదు. కాబట్టి వైవిధ్యభరితమైన, ఫ్యామిలీ చిత్రాలను బాగా ఆదరించే ఓవర్‌సీస్ ప్రేక్షకులు సింగం3ని ఆదరించడం కష్టమని అప్పుడే చాలా మంది భావించారు.
కానీ నాగార్జున అద్భుతంగా నటించి, జీవించిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం మాత్రం యూఎస్‌లో కలెక్షన్ల పంట పండిస్తుందని అందరూ ఆశించారు. దాంతో ఈ చిత్రం యూఎస్ రైట్స్‌ను ఏకంగా 5.5కోట్లకు కొన్నారని సమాచారం. కానీ ఎందుకనో ఈ చిత్రానికి కూడా యూఎస్‌లో పెద్దగా కలెక్షన్లు రావడం లేదని తెలుస్తోంది. ఈ వారం సినిమాలు చూడటానికి పెద్దగా యూఎస్‌లోని తెలుగు వారు ఆసక్తి చూపడం లేదంటున్నారు. దీంతో ఈ రెండు చిత్రాలకు కూడా కలెక్షన్లు రావడం లేదని అక్కడి డిస్ట్రిబ్యూటర్ వాపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ స్లోగానైనా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఏమైనా ఈ రెండు చిత్రాల విషయంలో నిర్మాతలు చాలా అసంతృప్తితో ఉన్నారనేది వాస్తవమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.