వాలంటైన్స్‌డే సందర్భంగా ఈరోజు పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'రోగ్' ప్రకటన పత్రికల్లో కనిపించింది. తలకిందులుగా వేలాడుతున్న హీరోని చూపిస్తూ, 'రోగ్' అనే టైటిల్‌ను వెరైటీగా డిజైన్ చేసి, ట్యాగ్‌లైన్‌గా 'మరో చంటిగాడి ప్రేమకథ' అని పెట్టారు. ఈ ప్రకటన చూస్తే మనకు పూరీ ఆనాడు రవితేజతో తీసిన 'ఇడియట్' చిత్రం గుర్తుకు రాకమానదు. ఈ చిత్రం రషెస్‌ను పూరీ ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీ పెద్దలకు చూపించాడట. దీనిని ఇప్పటివరకు చూసిన వారందరూ ఈచిత్రం పూరీకి మరో 'ఇడియట్' అవుతుందనే కాంప్లిమెంట్స్‌ను ఇచ్చారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రం ద్వారా పూరీ ఇషాన్ అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నాడు.
ఇషాన్ ఎవరోకాదు.. హీరో శ్రీకాంత్‌కు మంచి స్నేహితుడు, శ్రీకాంత్ నటించిన వందో చిత్రం 'మహాత్మా' చిత్రాన్ని నిర్మించిన మనోహర్ సోదరుడు. గతంలో పూరీ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుటుంబానికి ఎంతో ఆప్తుడు. దాంతో ఆ ఫ్యామిలీ వారు తమ కుటుంబం నుంచి పునీత్‌రాజ్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేయాలని భావించినప్పుడు పూరీని బెంగుళూరు పిలిచి మరీ అతని తెరంగేట్రం చిత్రానికి పూరీని ఒప్పించి, ఆయనకు అప్పగించారు. ఆ చిత్రమే 'అప్పు'. ఆ ఒక్క తొలి చిత్రంతోనే పునీత్‌రాజ్‌కుమార్ కన్నడలో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు.
ఆ చిత్రాన్నే తర్వాత తెలుగులో రవితేజను పెట్టి 'ఇడియట్' గా తీసి రవితేజను సైతం స్టార్‌ని చేశాడు. కానీ ప్రస్తుతం ఆయన 'రోగ్' చిత్రాన్ని కన్నడలో, తెలుగులో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ చిత్రం ద్వారా ఆయన హీరో ఇషాన్‌కు ఎలాంటి బ్రేక్‌నిస్తాడో చూడాల్సివుంది. ఇక ఈ చిత్రం రషెస్‌ను చూసిన బాలీవుడ్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సూరజ్ పంచోలిని హీరోగా పెట్టి ఈ చిత్రాన్ని తానే నిర్మాతగా రీమేక్ చేసుకునేందుకు ఇప్పటికే ఆయన పూరీని ఒప్పించాడని తెలుస్తోంది. మరి ఇప్పుడు కెరీర్‌పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూరీ ఈ చిత్రంతో మరలా తనను తాను ప్రూవ్ చేసుకొని, మరలా స్టార్స్‌ని క్యూలో నిలబెట్టేలా చేస్తాడని ఆశిద్దాం.