గత మూడేళ్లుగా అల్లు అర్జున్ వేసవిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఆయన తాజాగా కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతున్న 'డిజె' (దువ్వాడ జగన్నాధం)ని కూడా వేసవికే తేనున్నాడు. అయితే గత మూడేళ్లుగా బన్నీ ఏప్రిల్ నెలలో వచ్చి బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నాడు. 'రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు'లు ఇలా ఏప్రిల్‌లో రిలీజ్ అయి ఘనవిజయాలను నమోదు చేశాయి. ఇక 'డిజె'ను కూడా బన్నీ-దిల్‌రాజులు మొదట్లో ఏప్రిల్‌కే ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు పవన్ నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రం ఉగాది కానుకగా మార్చి29న విడుదల కానుంది. కాబట్టి ప్రస్తుతం బన్నీ-పవన్ ఫ్యాన్స్ మధ్య ఉన్న యుద్ద వాతావరణంలో ఓ నెలైనా గ్యాప్ లేకుండా వస్తే బన్నీపై తీవ్ర విమర్శలు తప్పవు.
పోనీ ఏప్రిల్ నెలాఖరుకు వద్దామంటే 'బాహుబలి2' అడ్డంగా ఉంది. సో.. ఇక తప్పని పరిస్థితుల్లో బన్నీ 'డిజె'ను మేనెలలో తేవడానికి రెడీ అవుతున్నాడు. అయితే మేనెలలో కూడా బన్నీ-దిల్‌రాజుల కాంబినేషన్‌లో వచ్చిన 'ఆర్య' సూపర్‌హిట్ అయింది. దీంతో ఈ సారి మేనెలతో బన్నీ సరిపెట్టుకోన్నాడు. ఇక 'డిజె' ఫస్ట్‌లుక్ పోస్టర్ ను నిన్న ఫిబ్రవరి 12న విడుదల చేశారు, ఫస్ట్‌టీజర్‌ను మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు దిల్‌రాజు అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి గతంలో బన్నీకి, దిల్‌రాజులకు ఎన్నో మ్యూజికల్ సెన్సేషన్స్ ఇచ్చిన దేవిశ్రీ సంగీతం అందిస్తుండటం, 'గబ్బర్‌సింగ్' తర్వాత ఫామ్ కోల్పోయినప్పటికీ, మరలా 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'తో ఓకే అనిపించుకున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని ఎంతో కసిగా చేస్తున్నాడు. మరోవైపు ఐరన్‌లెగ్‌గా ముద్రపడినప్పటికీ ఈ చిత్రంలో పూజాహెగ్డేను హీరోయిన్‌గా తీసుకోవడం చర్చనీయాంశం అయింది.