తాజాగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్4కు చిరు హోస్ట్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా షో ఈ రోజే ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా తాజాగా పార్క్‌హయత్ హోటల్‌లో ఈ కార్యక్రమం లాంచ్ చిరంజీవి చేతుల మీదుగా జరిగింది. దీంతో పాటు ఇదే కార్యక్రమంలో చిరు 'మా టీవీ' ఇక నుంచి 'స్టార్ మా'గా మారనున్న లోగోను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓ విలేకరి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి బాలకృష్ణను కూడా ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించాడు. దానికి చిరు ఎంతో ఉత్సాహంగా మేమిద్దరం చాలా క్లోజ్. గతంలో ఇదే హోటల్‌లో ఇదే వేదికపై నా బర్త్‌డే సందర్భంగా నేను, బాలకృష్ణ, సల్మాన్‌ఖాన్ కలిసి డ్యాన్స్ చేశాం.
నా డ్యాన్స్ అంటే బాలకృష్ణ బాగా ఎగ్జైట్ అవుతారు. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్‌లు ఈ కార్యక్రమానికి అతిధులుగా రావడానికి అంగీకరించారు. ఈ చానెల్ యాజమాన్యానికి బాలకృష్ణకు కూడా ఆహ్వానించమని చెబుతా. ఆయన సంతోషంగా వస్తారని భావిస్తున్నాను.. అని ఎంతో ఉత్సాహంగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత మరో విలేకరి 'ప్రశ్నించడానికే వచ్చానని చెబుతున్న జనసేన అధినేత పవన్‌ను మీరు ఈ కార్యక్రమంలో ఏమైనా ప్రశ్నించే అవకాశం ఉందా? అని ఓ మంచి ప్రశ్నను వేశాడు. కానీ దీనికి మాత్రం చిరు అసహనంగా సమాధానం ఇచ్చాడు. ఇది స్టార్ మా కార్యక్రమం.. ఇప్పటివరకు మీరు అడిగిన ప్రశ్నలన్నీ ఈ కార్యక్రమానివే కావడం బాగుంది.
కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన వేదిక ఇది కాదు.. దానిపై తర్వాత స్పందిస్తా... అంటూ కాస్త అసహనంగానే సమాధానం చెప్పారు. ఆ విలేకరి కూడా తప్పుగా ఏమి అడగలేదే? పవన్‌ను 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో మీరు ప్రశ్నించే అవకాశం ఉందా? అని ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్ననే అడిగాడు. కానీ చిరుకి మాత్రం అది అసందర్భంగా అనిపించడం ఏమిటి? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయినా మరోవైపు చిరు కోణంలో ఆలోచిస్తే ఆయన అసహనానికి కూడా ఓ కారణం ఉంది. తాను ఎన్నిసార్లు పవన్ గురించి సమాధానం చెప్పినా కూడా మీడియా వారు పదే పదే అదే ప్రశ్నను అడిగినందుకు చిరు అసహనానికి లోనైనట్లు ఉన్నాడు. కేవలం అతను నా బ్లడ్ రిలేషన్ అనే సమాధానంతోనే సరిపుచ్చాడు. మరి ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపిందా? లేక చిరు అనసవరంగా అసహనానికి గురైయ్యాడా? అనేది విజ్ఞులైన పాఠకులే తేల్చాలి.