హర్రర్ చిత్రాలకు కామెడీ టచ్ ఇచ్చి హర్రర్ కామెడీ చేస్తే హిట్ గ్యారంటీ అని ఎలా చెప్పగలమో? ప్రస్తుతం ఓ హీరోతో సినిమా చేస్తే మినిమం లాభాలు గ్యారంటీ అని కొందరు భావిస్తున్నారు. ఇక మెగామేనల్లుడికి ఇది సరిగ్గా సరిపోతుంది. మెగాఫ్యామిలీ నుండి వచ్చిన యువహీరోల్లో తొందరగా సినిమాలలో తనదైన ఇమేజ్‌ను తెచ్చుకుని, అందరినీ కలుపుకుపోతున్న మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ వరుణ్‌తేజ్ కంటే ఓ మెట్టుపైనే ఉన్నాడు. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నాడు. 'రేయ్, తిక్క' వంటి డిజాస్టర్స్ వచ్చిన కూడా మెగామేనల్లుడనిపించుకుంటున్నాడు. 'పిల్లా...నువ్వు లేని జీవితం, సుబ్రహ్యణ్యం ఫర్‌సేల్, సుప్రీం' వంటి చిత్రాలను బాగా ఉపయోగించుకుని స్టార్‌ఇమేజ్ వైపు అడుగులు వేస్తున్నాడు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటించిన 'విన్నర్' చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. కాగా ఇప్పటికే బి.వి.యస్.రవి దర్శకత్వంలో 'జవాన్' చిత్రం ప్రారంభించాడు. ఆయన త్వరలో వినాయక్ దర్శకత్వంలో నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సాయి నటించే తదుపరి చిత్రం వినాయక్‌దేనని, ఇప్పటికే వినాయక్ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. సాయితో ఓ సినిమా చేస్తానని తాజాగా వంశీపైడిపల్లి కూడా ప్రకటించాడు. అదే సమయంలో ఆయన కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న 'నక్షత్రం' చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీలకపాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత కృష్ణవంశీ సాయితో ఫుల్‌లెంగ్త్ హీరోగా కూడా ఓ చిత్రం చేయనున్నట్లు ఇప్పటికే హింట్ ఇచ్చాడు. ఇక త్వరలో సాయితో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్‌మీనన్ సిద్దం చేయాలనుకుంటున్నాడు. టాప్‌స్టార్స్ అందరూ బిజి బిజీగా ఉండటంతో చాలా మంది దర్శకనిర్మాతలు సాయిధరమ్‌తేజ్ వైపు చూస్తున్నారనేది వాస్తవం.