నేటి రోజుల్లో సినిమా తీయడం అంతా ఒక ఎత్తైతే... ఆయా హీరోల ఇమేజ్‌కు, సినిమా కథను జస్టిఫై చేసేలా టైటిల్ పెట్టడం మరింత కష్టతరంగా మారుతోంది. అందునా ప్రస్తుతం స్టార్‌హీరోలు మంచి పవర్‌ఫుల్ టైటిల్స్‌నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా, సాఫ్ట్ టైటిల్స్‌ను కూడా కోరుకుంటున్నారు. దీంతో 'అత్తారింటికి దారేది', 'నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి' వంటి టైటిల్స్ కూడా వచ్చి అలరిస్తూ, ఆకర్షిస్తున్నాయి. ఓ సినిమా విడుదలకు ముందే క్రేజ్ రావడానికి ఆ చిత్రం టీజర్స్, ట్రైలర్స్‌తో పాటు టైటిల్ కూడా ప్రధాన భూమిక వహిస్తోంది.
ఇక తాజాగా చాలామంది చిత్రాల షూటింగ్స్ పూర్తి కావస్తున్నా కూడా టైటిల్స్ విషయంలో సస్పెన్స్ వీడటం లేదు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ కూడా పూర్తికావచ్చింది. కానీ ఇప్పటివరకు టైటిల్‌ను అనౌన్స్ చేయలేదు. 'సంభవామి, ఏజెంట్‌శివ' వంటి టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం మొదలైంది. ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్‌ను చూస్తేనే ఇది పక్కా గ్రామీణకథ అని, రామ్‌చరణ్ పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నాడని తెలిసిపోయింది.
ఈ చిత్రానికి 'రేపల్లెలో గోపాలుడు, పల్లెటూరి మొనగాడు' అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అయింది. దీనికి 'జై..లవ..కుశ' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారంటూ ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. నాగచైతన్య హీరోగా నాగ్‌కు 'సోగ్గాడే...' వంటి బ్లాక్‌బస్టర్‌నిచ్చిన కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం పూర్తికావచ్చింది. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో 'కళ్యాణం' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఈ చిత్రాలన్నింటికీ ఇంకా మంచి టైటిల్స్‌ను వెతికే వేటలో యూనిట్ మొత్తం ఉందంటున్నారు.