జనాలను కొందరు గొర్రెల మందతో పోలుస్తుంటారు. వారిని బకరాలను చేయడం సులభమేనని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భావించడంలో కాస్త అర్ధముందని తాజా పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో యువత చేపట్టిన ఉద్యమానికి పవన్ వంటి పాపులర్ వ్యక్తి మద్దతు ఇవ్వడం, తద్వారా సినీ గ్లామర్ వచ్చింది. ఇదే ఉద్యమానికి జగన్ కూడా మద్దతు ఇవ్వడం వల్ల పొలిటికల్ మైలేజ్ వచ్చింది. దాంతో ఈ ఉద్యమం మీడియాలో కూడా హాట్‌టాపిక్ అయింది. మీడియాలో మొదటి పేజీ వార్తగా మారింది. కానీ గత మూడునాలుగు రోజులుగా అదే వైజాగ్‌లోని ఆర్కేబీచ్‌లో ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, ప్రత్యేకహోదా కోసం మేథావుల ఆమరణదీక్ష జరుగుతోంది.
కానీ ఈ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవ్వరు మద్దతు ఇవ్వలేదు. మీడియాకు కూడా అది పనికిమాలిన వార్తగా, రీడబులిటీ లేని అంశంగా, టీఆర్పీలు పెంచే అంశంగా కనిపించకపోవడం దారుణం. మరి దీనికి పవన్, జగన్ వంటి వారు మద్దతు తెలపలేదని, మీడియా ప్రాముఖ్యం ఇవ్వలేదని వారినే తప్పుపడదామా? లేక కనీసం ఈ విషయంలో జనాలు, యువత ఎలాంటి ఆసక్తిని చూపి, ఉద్యమంలో పాల్గొనకపోవడాన్ని, మీడియా సైతం ప్రాముఖ్యం ఇవ్వకపోవడాన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి? ప్రజల్లో ప్రత్యేకహోదా సెంటిమెంట్ లేదనడానికి ఇది ఓ ఉదాహరణా? అలా ప్రచారం చేయాలని చూస్తున్న టిడిపి, బిజెపిలకి ఇది ఒక్క ఆయుధంగా మారుతుందనేది వాస్తవం కాదా? మరి వీటికి ఎవరు సమాధానం చెబుతారు? ఈ ఆమరణదీక్షకు ప్రాముఖ్యం ఇవ్వకపోవడంపై పక్క రాష్ట్రానికి చెందిన ఓ చిన్న హీరో సంపూర్ణేష్‌బాబు మాత్రమే స్పందించాడు తప్ప మిగిలిన వారు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. తాజాగా తన కొత్త చిత్రం 'కొబ్బరిమట్ట'లోని తన ఓ వెరైటీ లుక్‌ను పోస్ట్ చేసిన సంపూ దీంతో పాటు అమెరికాలో పవన్ చేసిన ప్రసంగంపై మాట్లాడుతూ, కడుపు నిండినా నాయకుడికి, కడుపు మండిన నాయకునికి ఇదే తేడా అంటూ మెచ్చుకోవడం విశేషం.