నాగార్జున ఇప్పుడు సీనియర్‌స్టార్స్‌లో బాగా జోరుమీదున్నాడు. ఆయన నటించిన 'మనం, సోగ్గాడేచిన్నినాయనా, ఊపిరి' చిత్రాలు అభిమానులనే కాదు.. అందరీనీ బాగా ఆకట్టుకున్నాయి. ఇక మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం నిన్ననే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రంలో భక్తుడు హాథీరాంబావాజీగా నాగ్ జీవించాడని ప్రశంసలు లభిస్తున్నాయి. రాఘవేంద్రరావు మరోసారి తన దర్శక మాయాజాలాన్ని చూపించాడంటున్నారు. సో.. ఈ చిత్రం ఖచ్చితంగా మంచి హిట్ సాధించడం ఖాయమని అందరూ ఘంటాపదంగా చెబుతున్నారు.
ఇక విషయానికి వస్తే 'ఓం నమో వేంకటేశాయ' తర్వాత నాగ్ చేస్తున్న చిత్రం హర్రర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న 'రాజు గారి గది2'. ఈ చిత్రాన్ని 'ఊపిరి'ని నిర్మించిన ప్రతిష్టాత్మక సంస్థ పివిపి నిర్మిస్తుండటం విశేషం. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఓంకారన్నయ్య మీదనే అందరికి సందేహాలున్నాయి. కాగా హర్రర్ జోనర్‌లో వచ్చి తెలుగులో హిట్టయిన స్టార్ హీరో చిత్రం రజనీకాంత్ 'చంద్రముఖి' మాత్రమే. ఇక లారెన్స్ వంటి వారు, చిన్న హీరోలు, హీరోయిన్ ఓరియెంటెడ్‌గా రూపొందిన హర్రర్ కామెడీ చిత్రాలు బాగా ఆడినప్పటికీ మరో సీనియర్‌స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన 'నాగవల్లి' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక ఈమద్య ఎక్కువగా భక్తిరస చిత్రాలను తీస్తోన్న రాఘవేంద్రరావుతో మన హీరోలు నటించిన చిత్రాలు బాగానే ఆడినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మాత్రం డిజాస్టర్స్‌గా నిలిచాయి. 'అన్నమయ్య' తర్వాత 'చంద్రలేఖ, ఆటోడ్రైవర్' వంటి చిత్రాలు నాగ్‌కు ఎలాంటి చేదు అనుభవాలను మిగిల్చాయో అందరికీ తెలిసిందే. 'శ్రీరామదాసు' తర్వాత వచ్చిన 'బాస్', 'శిరిడీ సాయి' తర్వాత వచ్చిన 'ఢమరుకం, గ్రీకువీరుడు' చిత్రాల ఫలితాలు కూడా అందరికీ తెలిసిందే. ఇక నాగ్ 'జగద్గురు ఆదిశంకరాచార్య' అనే భక్తిరస చిత్రంలో 'ఛండాలుడు'గా ఓ చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత వచ్చిన 'భాయ్' చిత్రం ఫలితం విదితమే. ఇక చిరంజీవికి 'శ్రీమంజునాథ' తర్వాత 'అంజి', బాలయ్య 'పాండురంగడు' తర్వాత చేసిన 'మిత్రుడు' చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇలా చూసుకుంటే మరి నాగ్ నటించే తదుపరి చిత్రం 'రాజుగారి గది2' ఫలితంపై ఇప్పుడే ఆసక్తి మొదలైంది.