నరసింహంగా పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలు, అదిరిపోయే భీకరమైన డైలాగ్స్, వీరోచిత పోరాటాలు, పక్కా మాస్ అండ్ యాక్షన్ చిత్రాలుగా 'సింగం' సిరీస్‌లోని భాగాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే 'సింగం1', 'సింగం2'లు వచ్చి విజయం సాధించాయి. ఈ రెండు భాగాలు మంచి హిట్టయ్యాయి. కానీ తాజాగా నిన్న వచ్చిన 'సింగం3' మాత్రం మొదటి రెండు భాగాలతో పోలిస్తే పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. కేవలం మాస్ ఆడియన్స్‌ను, బి,సి సెంటర్ల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం రూపొందిందనే అనుమానం వస్తోంది.
ఇక ఈ మూడో పార్ట్ రెండో పార్ట్‌ను మక్కీకి మక్కీగా పోలివుండటం కూడా ఓ పెద్ద మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ ఈ చిత్ర దర్శకుడు హరి, హీరో సూర్య, నిర్మాత జ్ఞానవేల్‌రాజాలు ఈ సిరీస్‌ను ఇంతటితో ఆపేలా కనిపించడం లేదు. హాలీవుడ్ 'జేమ్స్‌బాండ్' చిత్రాలలాగా దీనిని కొనసాగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా 'సింగం4' కూడా ఉంటుందని దర్శకుడు హరి హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఈ నాలుగోపార్ట్ కథపై కూర్చోనున్నట్లు ఆయన తెలిపాడు. అయినా కూడా ఈ సిరీస్‌లోని ఒక్కో పార్ట్‌ను చూస్తుంటే ఈ చిత్రంలో పంజా పవర్ తగ్గుతూ వస్తోంది. మరి ఈ సింహం వేట ఆగేది ఎప్పుడో చూడాలి...!.