తమిళనాట రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. సంక్రాంతికి ముగిసిపోయే జల్లికట్టును మించి రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు అమ్మ జయకు వీరవిధేయుడైన పన్నీర్‌సెల్వం.. గత 30ఏళ్లగా జయకు నిచ్చెలిగా నడుస్తున్న శశికళల మధ్య నెంబర్‌గేమ్ నడుస్తోంది. కానీ తమిళ ప్రజల మనోభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. వీరవిధేయుడైనప్పటికీ పన్నీర్‌సెల్వంను బలహీన నాయకుడిగా వారు భావిస్తున్నారు. అదే సమయంలో కేవలం జయతో 30 ఏళ్ల సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన శశికళకు ముఖ్యమంత్రి అయ్యేందుకు అది హోదా కాదని, సర్పంచ్‌గా కూడా అనుభవం లేని ఆమె ముఖ్యమంత్రి ఎలా అవుతారని? కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానీ తమిళనాడుకు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇంకా వారికి నాలుగేళ్లకు పైగానే పాలించే అవకాశం, ఎమ్మెల్యేలుగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఏ ఎమ్మెల్యేకి కూడా ఇప్పటికిప్పుడు మరలా మధ్యంతర ఎన్నికలకు పోవాలనే కోరిక లేదు. దాంతో తమ అధికారం నిలుపుకోవడానికి, ఎమ్మెల్యేలుగా ఉండటానికి ఎక్కువశాతం మంది ఇంట్రస్ట్ చూపుతారు. పన్నీర్, శశికళలలో ఎవరి వైపు ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉంటే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వారికే మద్దతు తెలపక తప్పని పరిస్థితి. ఇలాంటి సమయంలో కొందరు శశికళకు మద్దతు తెలపలేక, బలహీనమైన నాయకుడైనప్పటికీ పన్నీర్‌కు మద్దతునిస్తున్నారు. కమల్, గౌతమి వంటి నటులు కూడ ఇలాగే ప్రవర్తిస్తున్నారు. తమిళనాట సినిమాలకు, రాజకీయాలకు బలమైన సంబంధం ఉంది.
ఇలాంటి సమయంలో జయను అమ్మగా భావించిన, జయ తన కొడుకుగా భావించిన అజిత్ వంటి వారు మౌనం వహిస్తుంటం ప్రమాదకరం. రాజకీయ అనుభవం లేకపోయినా బలమైన నటునిగా, జయకు సన్నిహితుడైన అజిత్ వంటి వారు ముందుకు వస్తేనే అన్నాడీఎంకే పార్టీ సజీవంగా నిలబడుతుందని, ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని భావించాలి. అజిత్ కనుక ముందుకు వస్తే అటు పన్నీర్‌కు, ఇటు శశికళలలో ఎవరికి మద్దతు తెలపాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న తమిళ ప్రజలు, ఎమ్మెల్యేలు, నాయకులు అజిత్ వెనుక నిలబడే అవకాశం ఉంది. అజిత్ తానంతట తాను ముందుకు రాకపోయినా బలహీన నాయకుడైన పన్నీర్ వంటి వారు శశికళను ముఖ్యమంత్రి కాకుండా ఆపాలంటే పన్నీరే ముందుకు వచ్చి అజిత్‌ను నాయకునిగా ప్రకటిస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.