బాలయ్య త్వరలోనే తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను బయోపిక్‌గా సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై సినీ వర్గాల వాదనలు ఒక విధంగా ఉంటే పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం భిన్నవాదలను వినిపిస్తున్నాయి. సినీ వర్గాలు కేవలం ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి, ముఖ్యమంత్రి అయిన వరకే చూపిస్తారని అంటుంటే, రాజకీయ విశ్లేషకులు మాత్రం భిన్న వాదన వినిపిస్తున్నారు. ఇది బాలయ్యకు వచ్చిన ఆలోచన కాదని, ఇది చంద్రబాబు వ్యూహంలో భాగమేనంటున్నారు.
ప్రతిసారి ప్రతిపక్షాలు తనను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని, మామను దెబ్బతీసిన అల్లుడని విమర్శలు ఇప్పటికీ సంధిస్తూనే ఉన్నారు. కానీ ఎన్టీఆర్ తర్వాత టిడిపిని లక్ష్మీపార్వతి చేజిక్కించుకుంటే ఇక ఇప్పటికే టిడిపి కనుమరుగయ్యేదని, పార్టీని పరిరక్షించడానికే చంద్రబాబు పార్టీని తన చెప్పుచేతల్లోకి తీసుకున్నాడనే వాదనను వినిపించే విధంగా ఈ చిత్రకథను మలచనున్నారని పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాను సమర్ధుడనైన నాయకుడిని కాబట్టే ఇప్పటికీ టిడిపి నిలిచి ఉందని, లేకపోతే ఎప్పుడో కనుమరుగయ్యేదనే వాదననను ఈ చిత్రంలో చూపించనున్నారని, ఎన్టీఆర్ పాత్రకు సమానంగా చంద్రబాబు పాత్రను కూడా మలిచి, ప్రజల్లో తనపట్ల ఉన్న అపోహలను తొలగించే దిశగా బాబు తన వియ్యంకుడైన బాలయ్యకు దిశానిర్దేశం చేస్తున్నారని టిడిపి అంతర్గత వర్గాలు చర్చింకుంటున్నాయి.