తమిళనాడులోని రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. అక్కడ మారుతున్న రాజకీయ పరిణామాలు చాలా ఉత్కంఠను రేపడమే కాకుండా జుగుప్సను కలిగిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి శశికళ అనుకున్న పరిస్థితులకు ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఏర్పడింది. నిన్నటికి మొన్నశశికళ తనకు అనుకూలంగా ఉంటున్న ఎమ్మెల్యేలు అంతా జారిపోకుండా ఉండేందుకు సుమారు 130 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను 8 బృందాలుగా చేసి చెన్నైలోని వివిధ రహస్య ప్రదేశాలకు చేర్చి వారిని ప్రసన్నం చేసుకొనేందుకు తగిన సముచిత ఏర్పాట్లు భారీగా జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఉన్నట్టుండి శశికళ క్యాంపులో ఉంటున్న ఓ 12మంది ఎమ్మెల్యేలు శశికళకు వ్యతిరేకంగా ఎదురు తిరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ 12మంది ఎమ్మెల్యేలు వరుసగా ఓ బృందంగా ఏర్పడి తాము బయటికి వెళతామని వారంతా మొరపెట్టుకుంటున్నప్పటికీ... ఏమాత్రం బయటకు పంపడం లేదని, కనీసం సెల్‌ఫోన్లలో కూడా తమను మాట్లాడుకోనివ్వకుండా చేస్తున్నారని ఆ ఎమ్మెల్యేలంతా వాపోతున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో ఇది ఒక పక్క జరుగుతుంటే.. ఆ రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్ సెల్వం వీరలెవల్లో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాడు. ఇంకా..ప్రస్తుతం శశికళ నివాసం ఉంటున్న పోయస్ గార్డెన్ ను జయలలిత మెమోరియల్ గా మార్చాలని ఇప్పటికే ప్రకటించిన ఆయన, ఇందుకు సంబంధించి రాతకోతలు కూడా త్వరలో విడుదల చేయాలని సీఎస్ ను ఆదేశించించినట్లుగా సమాచారం అందుతుంది . కాగా జయలలిత మరణం తర్వాత పోయస్ గార్డెన్ లో శశికళ నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.