త్వరలో తన తండ్రి స్వర్గీయ ఎన్టీరామారావు జీవితంపై తాను ఓ బయోపిక్ తీయనున్నానని, ఇందుకోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఇప్పటికే కమిటీ వేశామని, ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను తానే చేస్తానని ఇటీవలే నందమూరి బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత హడావుడిగా ఎందుకు ప్రకటించాడో అర్ధం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ చిత్రం విషయంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల వారే గాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయాన్ని విని సంతోషిస్తున్నారు. కాగా బాలయ్య ఎలాంటి సందర్భం లేకుండా ఈ చిత్రాన్ని బహిరంగ పరచడానికి కూడా గట్టి కారణమే ఉందని టాలీవుడ్ సమాచారం.
వాస్తవానికి తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌ను మొదట జూనియర్ ఎన్టీఆర్ చేయాలని భావించాడట. అందుకోసం దర్శకునిగా పూరీజగన్నాథ్‌ను పెట్టుకోవాలని జూనియర్ భావించి, పూరీ చేత స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నాడని సమాచారం. ఈ విషయం బాలయ్య చెవిన పడటంతో... ఈ బయోపిక్‌ను తీస్తే తానే తీయాలని, చేయాలని బావించి జూనియర్‌కు చెక్‌పెట్టేందుకే ఇలా హడావుడిగా బయోపిక్ మీద ప్రకటన చేశాడట. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను కూడా పూరీ జగన్నాథ్‌కే ఇచ్చి అందులో బాలయ్య నటించాలని భావిస్తున్నాడట. ఇక ఈ బయోపిక్‌లో చంద్రబాబు, లక్ష్మీపార్వతి వంటి వారిని చూపిస్తారా? లేదా? అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రంలో స్వర్గీయ ఎన్టీఆర్ సినీ జీవితాన్ని కూడా చూపించనున్నారు. మరి స్వర్గీయ ఎన్టీఆర్‌కు సహచరుడు స్వర్గీయ ఏయన్నార్ పాత్రను ఎవరు చేస్తారు? బాలయ్య చిత్రంలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ను వ్యతిరేకించిన సూపర్‌స్టార్ కృష్ణ పాత్ర ఉంటుందా? ఉండదా? అనే పలు విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.