మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ సినిమా స్టూడియో నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సంబంధించిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆయన ముంబాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ స్టూడియో విషయం అక్కడ నుండే బయటకు వచ్చింది. హైదరాబాద్ లో ఇప్పటికే 6 సినీ స్టూడియోలు ఉన్నాయి. వీటి నిర్వహణ యాజమాన్యాలకు భారంగా మారింది. చాలా సినిమాల షూటింగ్ విదేశాల్లో, ప్రయివేట్ ఇళ్ళలో జరుగుతున్నాయి. దీనివల్ల స్టూడియోల్లో స్టూడియోల అవసరం తగ్గింది. అన్నపూర్ణ స్టూడియోలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏసీ ఫ్లోర్లను నిర్మించినా, షూటింగ్ లు జరుగుతున్నది తక్కువే. చాలా ఫ్లోర్లను టీవీ షూటింగ్ ల కోసం లీజ్ కు ఇచ్చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరలో సింగిల్ ఫ్లోర్ తో మహేష్ బాబు స్టూడియో నిర్మించినా, అక్కడ షూటింగ్ చేయడం లేదు. భాగ్యనగర్, సి.సి. స్టూడియోలు ఎప్పుడో మూతపడ్డాయి. సారధి స్టూడియోలో షూటింగ్ లు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరు.ఇలాంటి పరిస్థితుల్లో చరణ్ స్టూడియో కట్టాలని అనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మెగా కుటుంబంలో ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. వారి ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తుంటారు. వారందరూ కూడా తన స్టూడియోలో షూటింగ్ లు చేసుకుంటే రన్ అవుతుందనే ఆలోచన చరణ్ కు ఉండవచ్చు.
ఇక పోతే గతంలో చిరంజీవి వైజాగ్ , విజయవాడ లో స్టూడియో కట్టాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైజాగ్ లో స్థిరపడతానని కూడా ఉన్నారు. తండ్రి వైజాగ్ వైపు తనయుడు హైదరాబాద్ వైపు మొగ్గు చూపడం ఆసక్తి కలిగిస్తోంది.
చరణ్ తన వ్యాపార లావాదేవిలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తుంటాడు. పైగా ఆయన సతీమణికి చెందిన అపోలో హాస్పిటల్ ఇక్కడే ఉంది. దీని పర్యవేక్షణ ఉపాసన చేస్తుంటుంది. ఇవి హైదరాబాద్ లోనే స్టూడియో నిర్మించడానికి కారణాలు కావచ్చని సన్నిహితులు అంటున్నారు.