కొత్త గాయనీ గాయకులను వెలికితీయడానికి బుల్లితెరపై ఎస్సీబాలు నిర్వహిస్తున్న 'పాడుతా తీయగా' కాంటెస్ట్‌ను సంగీత దర్శకుడు తమన్ ఫాలో అవుతున్నాడనే చెప్పాలి. ఒకప్పుడు దేవిశ్రీకి పోటీగా తమన్ వెలుగొందేవాడు. కానీ ఈమధ్య ఆయన జోరు కాస్త తగ్గింది. ప్రస్తుతం మరలా కొత్త కొత్త చిత్రాలను ఒప్పుకుంటూ మరోసారి బిజీగా మారాడు. తన చిత్రాలలో బాత్రూం సింగర్స్‌ని కూడా ఫ్రొఫెషనల్ సింగర్స్‌గా మార్చేస్తున్నాడు. గతంలో ఆయన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రతిభను చూసి 'రభస' చిత్రంలో పాట పాడించాడు.
ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ ఎన్టీఆర్ పాడిన పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఇక కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన 'చక్రవ్యూహ' అనే చిత్రంలో ఏకంగా ఎన్టీఆర్, కాజల్‌ల చేత కన్నడలో కూడా పాడించాడు. ఆ పాటలకు కన్నడంలో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. రవితేజతో 'బలుపు, పవర్'లలో హిట్ సాంగ్ పాడించాడు. అప్పటిదాకా ఎన్టీఆర్‌కు భాషలపై మంచిపట్టు, రవితేజ డైలాగ్ డిక్షన్ మాత్రమే పాపులర్, కానీ వారి చేత పాటలు పాడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన తమన్‌కురావడం నిజంగా అభినందనీయమే.
'బిజినెస్‌మేన్'లో కూడా ఓ పాటలో మహేష్ చేత కొద్ది డైలాగ్‌ల వంటివి చెప్పించాడు. ఇక ఆయన తాజాగా యాంకర్ సుమలోని టాలెంట్‌ను గమనించి, సాయి హీరోగా నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో అనసూయఐటం సాంగ్ అయిన 'సూయ..సూయ' అనే పాటను పాడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పాటను నిజంగా సుమనే పాడిందా? అనిపించేలా హస్కీ వాయిస్ పాడిన ఈ పాట ప్రస్తుతం యువతను పిచ్చెక్కిస్తోంది. ఈ పాట విన్నవెంటనే సుమ కనకాల ఇంటి ముందు సంగీత దర్శకులు క్యూ కట్టడం ఖాయం అనే ప్రశంసలు లభిస్తున్నాయి ఈ చిత్రం విజయం సాధిస్తే మాత్రం సుమ కనకాల ఇంటి ముందు జనసందోహం తప్పదనే చెప్పాలి.