దేశంలోనే కాదు... ప్రతి రాష్ట్రంలోనూ దళిత ఓట్లు కీలకమైనవి. అందుకే ఇటీవల యుపి ఎన్నికల సందర్భంగా ఓ బిజెపి అగ్రనాయకుడు దేశంలోని నోట్లపై గాంధీ బొమ్మను తీసేసి అంబేడ్కర్ బొమ్మను పెట్టాలంటూ సంచలన ప్రకటన చేశాడు. ఇక మన తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా దళిత ఓట్లు చాలా కీలకం. ఎస్సీలలోని మాదిగలు ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్నారు. మాలలు మాదిగల కంటే రిజర్వేషన్ ఫలాలను ఎక్కువగా పొందుతూ, ఆర్ధికంగా, ఉద్యోగాలలో, రాజకీయాలలో బాగా ఎదిగారని, కానీ మాదిగలు మాత్రం మాలల కంటే వెనుకబడ్డారని మందకృష్ణ మాదిగ వంటి వారు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు.
మాలలు దీనికి వ్యతిరేకిస్తున్నారు. ఇక సమైక్యాంధ్ర ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద మాలల కంటే మాదిగల ఓట్లు ఎక్కువ కావడంతో చంద్రబాబు, వైఎస్ వంటి వారు సైతం ఎస్సీవర్గీకరణకు మద్దతిచ్చి 'బడుగు'.. సారీ... 'బాడుగ' నేతలను బాగా ప్రోత్సహించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఏపీలో మాదిగల కంటే మాలలు కీలకం. దాంతో ఒకప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బాబు ఇప్పుడు ఏపీలో ఏమీ మాట్లాడటం లేదు. తమకు ఎస్సీ వర్గీకరణ కావాలని మాదిగలు చేస్తున్న డిమాండ్‌ను మాలనేతలైన పార్టీలు మార్చే జూపూడి ప్రభాకర్ వంటి వారు హైజాక్ చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో మాదిగ ఓట్లు కీలకం.
దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అన్ని పార్టీలు మాదిగలు చేస్తున్న వర్గీకరణకు మద్దతు తెలిపాయి. స్వయాన వెంకయ్యనాయుడు సైతం వర్గీకరణ సమంజసమేనని వాదించాడు. దీని వెనుక కూడా పెద్ద మతలబు ఉంది. దేశంలోని మాలలలో అత్యధికులు క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకున్నవారే. వారు ఎలాగూ బిజెపికి ఓట్లు వేయరని కేంద్రంలో కాంగ్రెస్‌కు, ఏపీలో వైసీపీకి వేస్తారని వారికి తెలుసు. కానీ మాదిగలలో ఎక్కువశాతం మంది ఇప్పటికీ హిందువులుగానే జీవిస్తున్నారు. సో.. ఆ ఓట్ల కోసం బిజెపి కూడా వర్గీకరణకు సిద్దంగా ఉంది. సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమ రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరుగుతుంటే అన్నిపార్టీలతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రం వద్దకు తీసుకెళ్లి తమ అందరి వాదనలను కేంద్రానికి వినిపించాలి.
కేసీఆర్ దానికి అనుగుణంగానే ఎస్సీ వర్గీకరణ కోరుతూ అఖిల పక్షాన్ని మోదీ వద్దకు తీసుకెళ్లాడు. కానీ చివరి నిమిషంలో మోదీ ఈ అఖిలపపక్షానికి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రద్దు చేశాడు. అదే సమయంలో ఆయన అమరావతి కేంద్రానికి భూములు ఇచ్చిన రైతులు చేసిన సన్మానానికి సమయం కేటాయించాడు. దీంతో మోదీ చర్యపట్ల తెలంగాణ ప్రజలు, నాయకులు మండిపడుతున్నారు. మరి ప్రత్యేకహోదా విషయంలో ఏపీ సీఎం మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లడానికే అంగీకరించడం లేదు. ఇలా అందరూ ఓట్ల రాజకీయాలు చేసేవారే గానీ చిత్తశుద్దితో పనిచేసే నాయకులే కనిపించడం లేదు.